వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) గురువారం కన్నుముశారు. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా తన సొంత సోషల్ మీడియా 'ట్రుత్ సోషల్' వేదికగా వెల్లడించారు. అయితే ఆమె మృతికి గల కారణాన్ని మాత్రం ట్రంప్ చెప్పలేదు.
'న్యూయార్క్ సిటీలోని తన నివాసంలో ఇవానా మరణించింది. ఆమె అందమైన, అద్భుతమైన మహిళ. గొప్ప స్ఫూర్తిదాయక జీవితాన్ని గడిపింది. ఆమెకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్‍లే సర్వస్వం. ఆమె పట్ల మేమూ గర్వపడుతున్నాం. ఇవానా ఆత్మకు శాంతి చేకూరాలి' అని ట్రంప్ భావోద్వేగ సందేశాన్ని రాసుకొచ్చారు.
ఇవానా ట్రంప్ ఓ మోడల్. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు పెళ్లైన ఏడాదికే డొనాల్డ్ జూనియర్ పుట్టాడు. ఆ తర్వాత 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ మార్లా మ్యాపుల్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. 1999లో ఈమెతో కూడా విడిపోయి 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment