ఫిబ్రవరి 8న అంటే రేపు (గురువారం) పాకిస్తాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే ముద్రించి సిద్ధంగా ఉంచారు. ఇక్కడ విశేషమేమిటంటే ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల గుర్తులు ఇంత విచిత్రంగా ఉన్నాయని తెలిస్తే ఎవరైనా పడీపడీ నవ్వుకుంటారు. అయితే ఇటువంటి ఎన్నికల గుర్తులపై పలువురు అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
పాక్ ఎన్నికలను ప్రపంచమంతా ఆసక్తికరంగా చూస్తోంది. ఈ ఎన్నికల్లో మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ తిరిగి ప్రధాని రేసులో ముందున్నారు. షాబాజ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన బిలావల్ భుట్టో కూడా ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల కోసం కమిషన్ జారీ చేసిన విచిత్రమైన ఎన్నికల గుర్తులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్ ఛార్జర్, సిమ్ కార్డ్, గాడిద బండి, వంకాయ్, బూట్లు, బాటిల్, వాష్ బేసిన్, నెయిల్ కట్టర్, స్క్రూ, స్పూన్, తవా, షటిల్ కాక్ ఇవన్నీ ఎన్నికల సంఘం.. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే.. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారు అమీర్ మొఘల్ వంకాయ్ ఎన్నికల గుర్తును పొందారు. ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తమకు అవమానకరమైన, విచిత్రమైన ఎన్నికల గుర్తులను కేటాయించిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఎన్నికల గుర్తును రద్దు చేసిన తర్వాత ఈ వివాదం మొదలైంది.
పీటీఐ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీకి దిగారు. పాకిస్తాన్‌లో ఓటింగ్ కోసం 26 కోట్ల బ్యాలెట్ పేపర్లను ప్రింట్ చేశారు. పాక్‌లోని మొత్తం 22 కోట్ల జనాభాలో 12.69 కోట్ల మంది ఓటర్లు నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. నవాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్.. ఈ ముగ్గురూ పాక్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. వీరికి చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్, పాకిస్తాన్ పార్టీ పీపుల్స్ పార్టీ అభ్యర్థుల మధ్యే గట్టి పోటీ ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment