వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా సోకిందన్న వార్తలతో అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. తనతోపాటు, భార్య మెలానియా ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ అయిందని ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణం మార్కెట్లో సెంటిమెంటు దెబ్బతింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు మొదలైన తరుణంలో ట్రంప్ వ్యాధి పరినపడటంతో రిపబ్లిక్ పార్టీ ఆందోళనలో పడిపోయింది. (కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు)
డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్1.7 శాతం పడిపోయాయి. బంగారం కూడా 0.55 శాతం క్షీణించి,ఔన్సు దర 1,894.60 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడిన ప్రపంచ నాయకుల జాబితాలోతాజాగా ట్రంప్ చేరారు. ఇంతకుముందు బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారోకు కూడా ఈ వైరస్ సోకింది. తనకు వైద్యం చేసిన డాక్టరకు వైరస్ పాజిటివ్ రావడంతో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, అలాగే భార్యకు కరోనా సోకడంతో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇంటినుంచే విధులను నిర్వర్తించిన సంగతి తెలిసిందే.
కాగా రెండవసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్ ఈసారి కాస్త వెనుకంజలో ఉన్నారని ఒపీనియన్ పోల్స్ చెబుతుండగా ట్రంప్‌నకు ఎదురులేదని రిపబ్లిక్ పార్టీ ధీమాగా ఉంది. అటు బైడెన్ కు తిరుగే లేదని, ముఖ్యంగా మహిళల ఆదరణ లభిస్తోందని, దీంతోపాటు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందస్తు ప్రెసిడెన్షియల్ డిబేట్లలో విజయవంతంగా మొదటి డిబేట్‌ను గెలిచారని డెమొక్రాటిక్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment