కనివినీ ఎరుగని రీతిలో 24 గంటల్లో మూడు సార్లు భూమి కంపించి టర్కీని ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆయా ప్రాంతాలన్నీ మృత్యు ఘోషతో విషాదమయంగా మారాయి. కోలుకోలేని బాధలో ఉన్న టర్కీకి భారత్ స్నేహ హస్తం చాపి కావాల్సిన నిధులను అందించింది. అలాగే టర్కీకి అవసరమయ్యే రెస్క్యూ, వైద్య బృందాలను పంపింది.
దీంతో భారత్‌లోని టర్కీ రాయబారి ఫిరత్ సునెల్ న్యూఢిల్లీకి కృతజ్ఞతలు తెలుపుతూ..ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. టర్కిష్ భాషలోనూ, హిందీలోనూ 'దోస్త్' (స్నేహితుడు) అనేది కామన్ పదం. టర్కిష్‌లోని 'దోస్త్ కారా గుండె బెల్లి ఒలూర్ (ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు)' అనే సామెతను ప్రస్తావిస్తూ..భారత్‌కి చాలా ధన్యవాదాలు అని అన్నారు.
కాగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ టర్కీ రాయబార కార్యాలయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సానుభూతిని, మానవతావాద మద్దతును కూడా ఆయన తెలియజేశారు. అంతేగాదు రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ప్రభుత్వ సమన్వయంతో ఎన్డీఆర్‌ఎఫ్ వైద్య బృందాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌ల తోపాటు రిలీఫ్ మెటీరియల్‌ను టర్కీకి పంపాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
అంతేగాదు ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌లు, అవసరమైన పరికరాలు, సుమారు 100 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు భూకంపం సంభవించిన ప్రాంతాలకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా ప్రకటనలో తెలిపింది. అలాగే తక్షణ సహాయక చర్యలపై చర్చించేందుకు సౌత్ బ్లాక్‌లో ప్రధాని ప్రిన్సిపాల్ సెక్రటరీ పీకే మిశ్రా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి కేబినేట్ సెక్రటరీ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ), డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, రక్షణ దళాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానాయన ఆరోగ్య మంత్రిత్వ శాక తదితర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేరకు ఈ పాటికే సహాయక సామాగ్రితో రెండు భారత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టర్కీ, సిరియాలకు బయలుదేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేగాదు ఆ బృందాలు వైద్య సామాగ్రి, మందులతో టర్కీలోని డమాస్కస్ చేరుకున్నాయని సమాచారం.
(చదవండి: వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతి అమ్మాయికి స్థానం)
Comments
Please login to add a commentAdd a comment