స్నేక్ ఐలాండ్..
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు.. మన దేశంలోనూ చాలా ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వ సంపద. కొంతమంది వీటిల్లో కొన్నిటికి వెళ్లి ఉంటారు కూడా.. ఈ హెరిటేజ్ సైట్స్ గురించి మనకు తెలుసు.. మరి.. కేవలం గూగుల్ మ్యాప్‌లోనే చూడగల సైట్స్ గురించి మీకు తెలుసా? ఎందుకంటే.. ఇక్కడ మనకు నో ఎంట్రీ.. ఈ ఆదివారం వరల్డ్ హెరిటేజ్ డే. ఈ సందర్భంగా అలాంటి డిఫరెంట్ ప్రదేశాల గురించి కాస్త తెలుసుకుందామా..
స్నేక్ ఐలాండ్..
ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ద్వీపం.. విస్తీర్ణం కేవలం 106 ఎకరాలు. బ్రెజిల్ తీరంలో ఉండే ఈ ప్రదేశం అత్యంత విషపూరితమైన సర్పాలకు నిలయం. చిన్న ద్వీపమే అయినా.. ఇక్కడ 4 వేలకు పైగా విషపూరితమైన పాములు ఉంటాయి. అందుకే.. బ్రెజిల్ ప్రభుత్వం ఇక్కడ పర్యాటకులను అనుమతించదు. శాస్త్రవేత్తలకు పరిశోధనల నిమిత్తం పరిమిత స్థాయిలో మాత్రమే అనుమతిస్తుంది.
సర్‌ట్ట్సీ
ఇదో ద్వీపం.. ఎలా ఏర్పడిందో తెలుసా? 1963లో సముద్రంలో పేలిన ఓ అగ్నిపర్వతం వల్ల.. దాని తాలూకు లావా అవన్నీ సముద్ర ఉపరితలం మీదకు వచ్చి.. కాలక్రమేణా ద్వీపంలా ఏర్పడింది. అప్పటినుంచి దీన్ని ఓ నేచర్ ల్యాబొరేటరీగా పరిరక్షిస్తున్నారు. ఏమీలేని బంజరు భూమిలాంటి దానిపై మళ్లీ జీవం పురుడుపోసుకోవడం.. మొక్కలు తదితర జీవజాతులు ఏర్పడటం వంటిదాన్ని జీవశాస్త్రవేత్తలు చాలా నిశితంగా గమనిస్తున్నారు. అందుకే ఇక్కడ ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. ఈ దీవి ఐస్‌ల్యాండ్‌కు దగ్గరగా ఉంది.
వాటికన్ రహస్య పత్రాలు..
ఇక్కడ ఎవరు పడితే వారు వెళ్లలేరు.. ఈ రహస్య పత్రాలపై అజమాయిషీ అంతా పోప్‌దే. ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, పండితులకు మాత్రమే ఇక్కడ ఎంట్రీ. ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల పరిశీలనల అనంతరం అనుమతి ఇస్తారు. ఇక్కడ వెయ్యేళ్ల క్రితం నాటి పత్రాలు ఉన్నాయి. అందులోనూ కొన్నిటిని మాత్రమే చూడటానికే అనుమతి ఇస్తారు.. ఇందులో ప్రఖ్యాత శాస్త్రవేత్త గెలీలియో విచారణకు సంబంధించినవి.. కింగ్ హెన్రీ–8, మార్టిన్ లూథర్ ఇలా ఎంతోమంది ప్రముఖులతో సాగించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఉన్నాయి. .. తొలుత అయితే.. సదరు శాస్త్రవేత్త లేదా పండితుల వయసు 75 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన కూడా ఉండేది.. తర్వాతి కాలంలో దీన్ని సడలించారు..
బొహీమియన్ గ్రోవ్..
కాలిఫోర్నియాలో 2700 ఎకరాల పరిధిలో వెయ్యేళ్లనాటి భారీ వృక్షాలతో కూడిన చిన్నపాటి అటవీ ప్రాంతంగా దీన్ని చెప్పవచ్చు. అమెరికాలోని రిచ్ అండ్ పవర్‌ఫుల్ వ్యక్తులకు సంబంధించిన బొహీమియన్ క్లబ్.. దీని ఓనర్. 1872లో ఈ క్లబ్‌ను స్థాపించారు. ఇందులో అత్యున్నత స్థాయి వ్యక్తులు, అమెరికా మాజీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతంలో ఇతరులకు ప్రవేశం నిషిద్ధం. మాజీ సైనికులు ఇక్కడ రక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఏటా వేసవిలో క్లబ్ సభ్యులు ఇక్కడ కలుసుకుంటారు.
స్వాల్‌బార్డ్ ప్రపంచ విత్తన బ్యాంకు
నార్వేకు సంబంధించిన ఓ ద్వీపంలో ఉందీ విత్తన బ్యాంకు. ప్రపంచంలో ఆహార సంక్షోభం లాంటివాటిని ఎదుర్కోవడానికి అన్ని రకాల పంటల విత్తనాలను ఇక్కడ దాచి ఉంచుతున్నారు. ప్రస్తుతం 9.3 లక్షల విత్తనాల శాంపిల్స్ ఉన్నాయి. దీన్ని కూడా మనం గూగుల్ మ్యాప్‌లోనూ.. ఫొటోల్లోనూ చూడాల్సిందే.. ఇక్కడ పర్యాటకులకు ఎంట్రీ నిషిద్ధం.
ఏరియా 51
ఇది చాలా ఫేమస్ ప్లేస్.. దీనిపై సినిమా కూడా తీశారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన అత్యంత రహస్యమైన ప్రదేశం.. నెవడాలో ఉంది. పై నుంచి విమానాలు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఇక మనలాంటోళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ఫొటోలే చాలా రేర్‌గా దొరుకుతాయి. ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నడుస్తాయని పైకి చెబుతారు కానీ.. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతోందన్నది ఎవరికీ తెలియదు.
ఉత్తర సెంటినల్ ద్వీపం..
సెంటినలీజ్.. మిగతా ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా జీవనం సాగించే తెగ ఇది. ఈ ద్వీపానికి వాళ్లు ఎవరినీ రానివ్వరు.. కనీసం చూడటానికి కూడా ఇష్టపడరు.. వీళ్లతో కాంటాక్ట్ అవడానికి ప్రయత్నించిన కొందరిని చంపేశారు కూడా.. ఈ సెంటినల్ ద్వీపం మరెక్కడో లేదు.. మన అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇది కూడా ఒకటి.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment