
కాబూల్: అఫ్గాన్‌లోని అన్ని జాతులు, తెగల నాయకులతో కూడిన సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తాలిబన్ వర్గాలు అల్‌జజీరా న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. ఇందుకోసం అన్ని వర్గాలతో చర్చలు జరుపుతున్నామని, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు యత్నిస్తున్నామని తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో భాగస్వాములుగా దాదాపు డజను మంది పేర్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేయదలిచిన ఈ సమ్మిళిత ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో వెల్లడించలేదు. అఫ్గాన్‌లో పలు తెగలు ఆయా ప్రాంతాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంటాయి. దేశం మొత్తం ఆధిపత్యం వహించగలిగే తెగలు మాత్రం లేవు. ఉన్నవాటిలో ఫష్తూన్ తెగ జనాభా పరంగా పెద్దది. మతపరంగా సున్నీ ముస్లింలు అధికంగా ఉన్నారు.
కొత్తగా ఏర్పడే ప్రభుత్వ అధినేత ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌కు ‘అమీర్ ఉల్ మోమినీ’(విశ్వాసుల నాయకుడు)గా వ్యవహరిస్తారని తాలిబన్లు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలకు ఒక సుప్రీం కౌన్సిల్ ఏర్పాటైందని తెలిపారు. కీలక మంత్రిత్వ శాఖలకు ఈ కౌన్సిల్ మంత్రులను నామినేట్ చేయవచ్చు. ప్రస్తుతం తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా బరాదర్ కాబూల్‌లోనే ఉండగా, ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ ఇక్కడికి చేరుకొని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలిసింది. పాత ప్రభుత్వ పెద్దల్లో కర్జాయ్ లాంటి కొందరిని కొత్త ప్రభుత్వంలో చేర్చుకోవాలని అమెరికా ఒత్తిడి తెస్తున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.
తాలిబన్లతో మసూద్ అజర్ భేటీ
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ తాలిబన్లను కలుసుకొని కశ్మీర్‌లో ఉగ్ర దాడులకు సాయం చేయాలని కోరినట్టు తెలిసింది. తాలిబన్లు అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న సమయంలో మసూద్ అజర్ కాందహార్‌లో ఉన్నట్టు సమాచారం. ముల్లా అబ్దున్ ఘనీ బరాదర్ సహా పలువురు తాలిబన్ నాయకుల్ని కలుసుకొని కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యకలాపాలకు సహకరించాల్సిందిగా వారిని కోరినట్టు తెలుస్తోంది.