కొత్త సంవత్సరం వచ్చిందంటే.. ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. పాత ఏడాది ఇచ్చిన చేదు అనుభవాలను మరిచిపోయి.. తీపి జ్ఞాపకాలను గుర్తుపెట్టుకొని సరికొత్త ఆకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
అయితే ఈ వేడుకలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా జరుగుతుంటాయి. భిన్న సంస్కృతులు, విభిన్న సంప్రదాయాలు, ఆచారాలు ప్రతిబింబిస్తాయి. ప్రపంచమంతా క్రమంగా 2023కు వీడ్కోలు పలుకుతూ.. 2024కు స్వాగతం పలికిన తరుణంలో.. వివిధ దేశాల ప్రజలు జరుపుకునే వేడుకలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు..
♦ డెన్మార్క్‌లో ప్రజలు తమ ఇళ్లలోని పింగాణీ పాత్రలను గది తలుపులపైకి విసిరేస్తారు. అవి పగిలి.. ఎన్ని ముక్కలైతే కొత్త ఏడాది అంత అదృష్టం కలిసొస్తుందని వారి నమ్మకం.
♦ గ్రీస్ ప్రజలు ‘వాసిలోపిటా’ అనే కేక్‌లో ఒక నాణాన్ని కనిపించకుండా పెడతారు. ఎవరికైతే ఆ నాణెం ఉన్న కేక్ భాగం వస్తుందో.. వారికి ఆ ఏడాదంతా అదృష్టం కలిసి వస్తుందని విశ్వసిస్తారు.
♦ నూతన సంవత్సరం అంటేనే పాతకు వీడ్కోలు చెప్పడం. దీనికి సూచికగా దక్షిణాఫ్రికా ప్రజలు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి పాత వస్తువులను కిటికీల నుంచి బయటకు విసిరేస్తారు.
♦ స్కాట్లాండ్‌లో అర్ధరాత్రి దాటాక తమ ఇంట్లోకి మొదటగా ఎవరు అడుగు పెడతారో.. వారి వల్ల అదృష్టం వస్తుందని విశ్వసిస్తూ బహుమతులు ఇచ్చుకుంటారు.
♦ స్పెయిన్‌లో డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలు కాగానే.. 12 ద్రాక్ష పండ్లు తినడం సంప్రదాయం. ఒక్కో పండు ఒక్కో నెలకు సంకేతం. ఇలా తినటం వల్ల అదృష్టం లభిస్తుందని నమ్ముతారు.
♦ జపాన్‌లో ప్రజలు అర్ధరాత్రి వేళ బౌద్ధ దేవాలయాలకు వెళ్లి 108 సార్లు గంటలు మోగిస్తారు.
♦ బ్రెజిల్‌లో జనం తెలుపు రంగు దుస్తులు ధరించి సముద్ర దేవత యెమాంజకు నైవేద్యంగా సముద్రంలోకి పూలను విసిరి పాటలు పాడతారు.
♦ ఫిలిప్పీన్స్‌లో గుండ్రని ఆకారంలో ఉన్న వస్తువులు, దుస్తులు అదృష్టం తెచ్చిపెడతాయని విశ్వసిస్తారు. అందువల్ల అక్కడి వారు నూతన సంవత్సరాన్ని ఆహా్వనిస్తూ గుండ్రని చుక్కలు ఉన్న దుస్తులు ధరిస్తారు. ఆ రోజు గుండ్రని పండ్లు తింటారు.
♦ రష్యాలో కాగితంపై న్యూ ఇయర్ విషెస్ రాసి దానిని కాల్చి ఆ పొడిని అర్ధరాత్రి షాంపైన్లో కలుపుకొని తాగుతారు.
♦ అమెరికాలోని న్యూయార్క్‌లో అర్ధరాత్రి 12 గంటలకు టైమ్ బాల్‌ను కిందకు వదులుతారు. దీన్ని ‘బాల్ డ్రాప్’ అంటారు. అలా వారికి కొత్త సంవత్సరం మొదలవుతుంది.
కిరిబతిలోనే తొలి సంబరం..
ప్రపంచంలో అందరికంటే ముందు పసిఫిక్ సముద్రంలోని కిరిబతి దీవుల్లోనే కొత్త సంవత్సరం వస్తుంది. భారత కాలమానం ప్రకారమైతే డిసెంబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకే ఆ ప్రాంతం నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియా దేశాల్లో మనకంటే ఆరేడు గంటల ముందే మొదలవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మనకంటే మూడున్నర గంటల ముందే అడుగుపెడతాయి. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు భారత్ కంటే అరగంట ముందు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతాయి.
చైనాలో వేడుకలు ఉండవు..
జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకోని దేశాలు కూడా ఉన్నాయి. చైనాతో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, వియత్నాం దేశాలు న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవు. వారి క్యాలెండర్ ప్రకారమే అక్కడ కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకుంటారు. చైనా ప్రజలు ఫిబ్రవరి నెలలో నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటారు.
మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే..
♦ న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30
♦ ఆస్ట్రేలియా.. మనకు సాయంత్రం 6.30
♦ జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30
♦ చైనా, మలేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్.. మనకు రాత్రి 9.30
♦ థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30
♦ యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 1.30
♦ గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 3.30
♦ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30
♦ యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు మనకు జనవరి 1 తెల్లవారుజామున 5.30
♦ బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ.. మనకు జనవరి 1 ఉదయం 8.30
♦ ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30
♦ అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30
♦ మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30
♦ అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30
♦ హవాయ్.. మనకు జనవరి 1 మధ్యాహ్నం ఉదయం 3.30
♦ సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30
♦ బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 5.30
సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు..
వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్‌లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది.
♦ ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా ఆధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలుంటే.. రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment