
ప్రతీకాత్మక చిత్రం
న్యూయార్క్: యూఎస్‌లోని నార్త్ కరోలినాలో ఒక విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో కో పైలెట్ కిందపడి మృతి చెందాడు. ఐతే అతను విమానం అత్యవసర ల్యాండింగ్ టైంలో దూకేశాడా? లేక ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియరాలేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో పారాచూట్ లేకుండా ఎలా దూకేశాడు అంటూ అధికారులు పలు అనుమానాలు లేవనెత్తారు.
మృతి చెందిన సదరు కోపైలెట్ 23 ఏళ్ల చార్లెస్ హ్యూ క్రూక్స్‌గా గుర్తించారు అధికారులు. అతడి మృతదేహం విమానాశ్రయానికి దక్షిణంగా సుమారు 48 కిలోమీటర్లు దూరంలో లభించిందని అధికారులు తెలిపారు. అంతేకాదు విమానంలో మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ, నేషనల్ సేఫ్టి బోర్డు ఈ ఘటనకు గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రమాదానికి ముందు విమానం కుడివైపు ఉన్న చక్రం కోల్పోవడంతో పైలెట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సాయం కోరినట్లు అధికారులు తెలిపారు.