సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కావాలంటే తన ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఎంచుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు కరోనా సంక్షోభం కారణంగా వారు ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే అందుకు తగిన సహాయం చేస్తామని కూడా ప్రకటించింది. అమెరికాలో దాదాపు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావడం, త్వరలోనే అన్ని కార్పొరేట్ క్యాంపస్‌లలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫేస్‌బుక్ తాజా ప్రకటన చేసింది.
జూన్ 15 నుండి, రిమోట్‌గా ఉద్యోగం చేయాలనుకునే ఏ ఉద్యోగి అయినా శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసుకునేలా అనుమతిస్తున్నామని ఫేస్‌బుక్ తెలిపింది. మంచి పని ఎక్కడైనా చేయవచ్చని గత సంవత్సర అనుభవం నేర్పిందని, దీంతో పనిచేసే ప్రదేశం కంటే పనిచేసే విధానమే ముఖ్యమైనదని తాము నమ్ముతున్నామని పేర్కొంది. రిమోట్‌గా పనిచేసే ఉద్యోగుల కోసం వ్యక్తిగతంగా సమావేశాలను నిర్వహించాలని యోచిస్తోంది. మే 2020 లో ఫేస్‌బుక్ కొంతమంది ఉద్యోగులను, ముఖ్యంగా అత్యంత సీనియర్ అనుభవజ్ఞులైన ఉద్యోగులను శాశ్వత రిమోట్‌గా పనిచేసుకోవచ్చని ప్రకటించింది. అయితే ఫుల్ టైం ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనికోవచ్చంటూ ఉద్యోగులకుం పంపిన సమాచారంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తాజాగా వెల్లడించారు. దీనికనుగుణంగా హైబ్రిడ్ కార్యాలయాలు, రిమోట్ సెటప్ కోసం కంపెనీ ప్రణాళికలను నిర్దేశిస్తోందన్నారు.
కాగా గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఫేస్‌బుక్, గూగుల్, యాపిల్ లాంటి ఇతర దిగ్గజ కంపెనీలు రిమోట్ వర్క్ మోడల్ వైపు మొగ్గు చూపాయి అయితే సిలికాన్ వ్యాలీలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, అందరూ వ్యాక్సిన్‌లు తీసుకున్న నేపథ్యలో ఫేస్‌బుక్ ఆఫీసులను ఓపెన్ చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులు డ్యూటీలకు హాజరు కావాలని ఆహ్వానిస్తోంది. అయితే తిరిగి వచ్చిన ఉద్యోగుల పని షెడ్యూల్ సరళంగా ఉంటుందని, కనీసం సగం సమయం క్యాంపస్‌లో ఉండాలని చెబుతోంది. అలాగే ఫేస్‌మాస్క్, భౌతిక దూరం లాంటి కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించింది. సుమారు 60వేల ఉద్యోగులున్నఫేస్‌బుక్ సిలికాన్ వ్యాలీలో వచ్చే సెప్టెంబర్ ఆరంభం నాటికి 50శాతం సామర్థ్యంతో పని చేయాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment