ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ మనిషికి బర్డ్‌ఫ్లూ వైరస్ సోకడం.. ఆ కేసు కూడా చైనాలో నమోదు అయ్యిందన్న కథనాలతో ప్రపంచం ఉలిక్కి పడింది. ఇది మరో మహమ్మారికి దారితీయబోతోందా?, అప్రమత్తం కావాల్సిన ఉందనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇంతకి ఇప్పుడు వినిపించే ఆ బర్డ్ ఫ్లూ వైరస్ కారకం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
న్యూఢిల్లీ: తూర్పు చైనాలోని జింగ్సూ ప్రావిన్స్‌లో బర్డ్‌ఫ్లూ వైరస్ సోకిన వ్యక్తి కేసు తాజాగా నమోదు అయ్యింది. జెన్జియాంగ్కు చెందిన 41 ఏళ్ల ఆ వ్యక్తి బర్డ్‌ఫ్లూ వైరస్‌లోని హెచ్10ఎన్3 స్ట్రెయిన్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ కేసు వివరాల్ని ధృవీకరిస్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఒక నివేదికను కూడా విడుదల చేసింది. దీంతో ప్రపంచంలో ఇదే మొదటిసారి మనిషికి వైరస్ సోకడం అంటూ కథనాలు ప్రచురితం అయ్యాయి. అయితే మనుషులు ఏవియన్ ఇన్ఫ్లూయెంజాల బారినపడడం చాలా సాధారణమైన విషయమని, హెచ్10ఎన్3 స్ట్రెయిన్‌తో పక్షులతో పాటు మనుషులకూ ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేం లేదని సైంటిస్టులు చెబుతున్నారు.
గతంలో..
ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా దేశంలో ఏడుగురు బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8 స్ట్రెయిన్) బారినపడి కోలుకున్నారు. అలాగే పోయినేడాది డిసెంబర్లో చైనా హువాన్ ప్రావిన్స్‌లో ఓ బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్6 స్ట్రెయిన్) కేసు నమోదు అయ్యింది. ఇలా బర్డ్‌ఫ్లూ వైరస్ కారకాలతో ఇంతకు ముందు చాలానే కేసులు రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) భరోసా ఇస్తోంది. ఇక ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలో హెచ్5ఎన్1 మాత్రం కొంచెం రిస్క్ ఉన్న బర్డ్‌ఫ్లూ వైరస్. దీని రిస్క్ రేటు 40 నుంచి 50 శాతం దాకా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల 1997లో 455 మంది ప్రపంచం మొత్తంగా చనిపోయారు. అలాగే హెచ్7ఎన్9 స్ట్రెయిన్ కూడా చాలా ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. 2016-17 శీతాకాలం టైంలో చైనాలో ఈ స్ట్రెయిన్ వల్ల 300 మంది చనిపోయారు. కానీ, బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషి నుంచి మనిషికి సోకడం చాలా చాలా అరుదుగా జరిగే విషయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఎలా సోకుతుందంటే..
సాధారణంగా బర్డ్‌ఫ్లూ వైరస్ మనిషికి సోకడం చాలా అరుదు. పక్షులు, కోళ్లు, ఇతరత్రా పక్షుల పెంపక పరిశ్రమల ద్వారా బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందుతుంది. కరోనా వైరస్ తరహాలోనే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాలు (హెచ్10ఎన్3 స్ట్రెయిన్ సహా) తుంపర్ల ద్వారా మనుషులకు సోకుతాయి. అయితే వీటితో(కొన్ని స్ట్రెయిన్లను మినహాయిస్తే) మనుషులకు రిస్క్ రేటు తక్కువ. త్వరగా కోలుకుంటారు కూడా. అలాగే పక్షులకు కూడా రిస్క్ రేటు తక్కువే అయినప్పటికీ ఒక్కోసారి అవి ఇన్ఫెక్షన్ తట్టుకోలేక చనిపోతుంటాయి. గతంలో రికార్డు అయిన మనుషులకు బర్డ్‌ఫ్లూ కేసులు కూడా ఫౌల్ట్రీతో దగ్గరి సంబంధాలు ఉన్నవే. ఆ టైంలో వాటికి దూరంగా ఉండడంతో పాటు చచ్చిన కోళ్లను మిగతా వాటి నుంచి త్వరగా వేరుచేయడం ద్వారా నష్టాన్ని నివారించొచ్చని సూచిస్తున్నారు. అలాగే బర్డ్‌ఫ్లూ ఇన్ఫెక్షన్లతో పక్షులకు జరిగే నష్టం కూడా చాలా అరుదని, కానీ, చాలామంది అప్రమత్తత పేరుతో వాటిని చంపుతుంటారని సైంటిస్టులు చెప్పారు. ఇక చైనాలో తాజాగా నమోదు అయిన కేసు కూడా ఈ కోవకే చెందుతుంది. ఇన్ఫెక్షన్కి గురైన పక్షుల ద్వారా ఆ వ్యక్తిని వైరస్ సోకి ఉంటుందని చైనా ఆరోగ్య కమిషన్ భావిస్తోంది. అంతేకాదు అతని వల్ల ఆ వైరస్ మరెవరికీ సోకలేదని నిర్ధారించింది కూడా. ప్రస్తుతం అతను కోలుకోవడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి రెడీగా ఉన్నాడని డబ్ల్యూహెచ్‌వోకు ఒక రిపోర్ట్ కూడా సమర్పించింది చైనా. చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు
వేరియెంట్లతో రిస్క్ ఛాన్స్!
వైరస్ స్ట్రెయిన్లు వేరియంట్లను మార్పుకోవడం సాధారణం. కరోనా విషయంలో ఇది చూస్తున్నాం కూడా. అలాగే బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్స్ కూడా ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు తేవొచ్చని ఎఫ్ఏవో ఎమర్జెన్సీ సెంటర్ సైంటిస్ట్ ఫిలిప్ క్లాయిస్ చెప్తున్నారు. గతంలో బర్డ్‌ఫ్లూ కేసుల్ని కొన్నింటిని ప్రస్తావించిన ఆయన.. మనుషుల నుంచి మనుషులకు ఆ వేరియెంట్ల వల్లే వ్యాపించిందన్న(అతికొద్ది ఇన్ఫెక్షన్ కేసులు) విషయాన్ని గుర్తుచేస్తున్నాడు. ఇక ఫ్లూ వైరస్లు వేగంగా మ్యుటేంట్ కావడం, పక్షుల పెంపకం.. వలస పక్షుల వల్ల మనుషులకు రిస్క్ రేటు ఎక్కువగా ఉండొచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న హెచ్10ఎన్3 వేరియెంట్ జెనెటిక్ సీక్వెన్స్ తెలిస్తేనే తప్ప.. రిస్క్ తీవ్రతపై ఓ స్పష్టత రాదని ఆయన అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment