ఇజ్రాయెల్‌లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్‌  | Hamas Attacks In Israel New Live Updates | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌లో మరింత దారుణం.. యుద్ధంలోకి ‘హెజ్బొల్లా’ గ్రూప్‌ 

Published Sun, Oct 8 2023 8:30 AM | Last Updated on Sun, Oct 8 2023 4:58 PM

Hamas Attacks In Israel New Live Updates - Sakshi

Updates..

హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 250 మంది మృతి
ఇజ్రాయెల్‌ దాడుల్లో 232 మంది పాలస్తీనియన్లు మృతి

యుద్ధంలోకి లెబనాన్‌ మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ 
ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. హమాస్‌కు మద్దతుగా తాజాగా లెబనాన్‌లోని మిలిటెంట్‌ సంస్థ ‘హెజ్బొల్లా’ కూడా యుద్ధంలోకి దిగింది. 
ఆదివారం హెజ్బొల్లా గ్రూప్‌ డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది.
ఈ స్థావరాలు ఇజ్రాయెల్‌ ఆధీనంలోని గోలన్‌హైట్స్‌ వద్ద ఉన్నాయి.
ఈ దాడులపై హెజ్బొల్లా అధికారికంగా స్పందించింది. భారీ సంఖ్యలో రాకెట్లు, షెల్స్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది. 
తాము పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా దాడి చేసినట్లు ప్రకటన చేసింది. 
ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. జిబ్‌డెన్‌ ఫామ్‌, షీబా ఫామ్స్‌ వద్ద ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 
ఇప్పటికే తాము ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపుదాడికి ఇరాన్‌ నుంచి మద్దతు లభించిందని హమాస్‌ ప్రకటించింది. 
తాజాగా లెబనాన్‌లోని హెజ్బొల్లా కూడా ఈ యుద్ధంలోకి రావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదముంది.

పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు
మరోవైపు హెజ్బొల్లా  దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తిప్పికొట్టాయి. 
ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారో మాత్రం వెల్లడించలేదు. 
తమపైకి మోర్టార్‌ గుండ్లను ప్రయోగించిన ప్రదేశంపై ఎదురు దాడి చేశామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించంది. 
గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ 1981లో స్వాధీనం చేసుకుంది.

బందీలుగా సైనికులు, పౌరులు
హమాస్ గ్రూప్ చేసిన ఉగ్రదాడిలో కనీసం 100 మంది ఇజ్రాయెల్ పౌరులు, సైనికులు బందీలయ్యారు. 
హమాస్‌ మిలిటెంట్ల దాడిలో ప్రాణాల కోసం పోరాటం జరుగుతోంది.
ఈ మేరకు యూఎస్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయంలో ట్విట్టర్‌లో పేర్కొంది. 

పాలస్తీనా అధ్యక్షుడితో బ్లింకన్‌ చర్చలు..
పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఫోన్‌లో చర్చలు జరిపారు. 
వెస్ట్‌బ్యాంక్‌లో శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. 
అదే సమయంలో ఇజ్రాయెల్‌పై జరిగిన ఉగ్రదాడులను ఖండిస్తున్నట్లు బ్లింకన్‌ వెల్లడించారు. 
ఆ ప్రాంతంలోని దేశాలు కూడా ఈ దాడిని ఖండించాలని పేర్కొన్నారు. 
ఈ విషయాన్ని పాలస్తీనా అథారిటీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు.  

ఎలాంటి చర్యలకైనా సిద్ధం..
తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలనైనా చేపడతామని ఐరాస భద్రతా మండలికి ఇజ్రాయెల్‌ ప్రతినిధి గలీద్‌ ఎర్డాన్‌ వెల్లడించారు. 
ఈ మేరకు ఆయన శనివారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాల్గొన్నారు. 
ప్రస్తుతం గాజా పట్టీ నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని తెలిపారు. 

డ్యాన్స్‌ పార్టీపై హమాస్‌ దాడులు..
ఇజ్రాయెల్‌లో ఉత్సాహంగా జరుగుతున్న ఓ డ్యాన్స్‌ పార్టీపై హమాస్‌ మిలిటెంట్లు దాడి చేశారు. 
ప్రాణాలు కాపాడుకునేందుకు నిస్సహాయంగా పరుగులు తీస్తున్నవారిని పిట్టల్లా కాల్చిచంపారు. 
కొద్దిసేపట్లోనే ఆ పార్టీ జరుగుతున్న పొలం రక్తసిక్తమైంది.
మృతుల్లో చాలా మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు.
రాకెట్ల దాడి ఆగిన తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ఆ పార్టీకి హాజరైన అతిథులు కార్లను ఒకేసారి తీయడంతో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది.
ఆ ప్రాంతంలోకి వచ్చిన హమాస్‌ ఉగ్రవాద బృందాలకు ఇది అవకాశంగా దొరికింది. వారిని చుట్టుముట్టి ఫైరింగ్‌ మొదలుపెట్టారు.

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని ఖండించిన ప్రపంచదేశాలు
భారత్‌ సహా బ్రిటన్‌, అమెరికా వంటి దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు తెలిపాయి. 
మరోవైపు కొందరు హమాస్ మద్దతుదారులు లండన్‌లో సంబరాలు చేసుకున్నారు. 
దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
హమాస్‌ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్‌ వీధుల్లో సంబురాలు చేసుకుంటూ కనిపించారు. 
దీనిపై లండన్‌ మెట్రోపాలిటన్ పోలీసులు స్పందించారు. 
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారి తీయొచ్చు. 
లండన్‌ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించం. అలాంటి వాటిని అడ్డుకునేందుకు పోలీసు గస్తీని పెంచాం.

నెటిజన్ల ఆగ్రహం..
ఇజ్రాయెల్‌లో ఎంతోమంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారు. 
అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
దాడి చేసిన వారికి మద్దతుగా లండన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. 
యూరప్‌లో చాలా మంది యూదులపై మాత్రమే దాడి జరుగుతుందనుకుంటున్నారు. 
హమాస్‌ వంటి ఉగ్రవాదులు తమదాకా రారని భావించడం మూర్ఖత్వం అని ట్వీట్లు చేస్తున్నారు. 

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాలస్తీనాకు చెందిన హమాస్‌ మిలిటెంట్లు శనివారం గాజా స్ట్రిప్‌ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. ఆ వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడ్డారు.

పండుగ వేళ ఆదమరచిన ఇజ్రాయెలీలపైకి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు, విధ్వంసానికి దిగారు. మిలిటెంట్ల దాడుల్లో దాదాపు 500 మంది మృత్యవాతపడినట్టు తెలుస్తోంది. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. 

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులను అగ్రరాజ్యం అమెరికా ఖండించింది. ఈ దాడులను ప్రతిఘటించడంలో ఇజ్రాయెల్‌కి అమెరికా అండగా ఉంటుందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తెలిపారు.

ఈ సందర్బంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘మానవీయ కోణంలో ఇదొక ఘోరమైన విషాదం. నేను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో మాట్లాడాను. ఈ ఉగ్రదాడిని ఎదుర్కొంటున్న దేశ ప్రజల వెంట అమెరికా ఉంటుందని హామీ ఇచ్చాను. ఈ సమయంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడానికి ఇజ్రాయెల్‌కు పూర్తి హక్కు ఉంది. నా పాలనలో ఇజ్రాయెల్‌ భద్రతకు ఇచ్చే మద్దతు అచంచలమైనది. వారి ప్రజలకు సాయం చేయడంలో, దాడుల్ని ప్రతిఘటించడంలో వెన్నంటే ఉంటాం. ఇజ్రాయెల్‌ శత్రులెవరైనా ఈ దాడుల్ని అడ్డుపెట్టుకొని ప్రయోజనం పొందాలని చూడొద్దు అంటూ హెచ్చరించారు.

► మరోవైపు.. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఇజ్రాయెల్‌ దాడులపై ట్రంప్‌ స్పందిస్తూ.. దాడులకు ఖండిస్తున్నాం. ఈ దాడులకు జో బైడెన్‌నే కారణం. అమెరికా పౌరులు చెల్లించిన పన్నులే ఈ దాడులు చేయడానికి సాయపడ్డాయి. బైడెన్‌ పరిపాలనా యంత్రాంగం నుంచి వచ్చిన అనేక నివేదికలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.

ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా అమెరికా ఇరాన్‌కు గత నెలలో 6 బిలియన్‌ డాలర్లను మంజూరు చేసింది. ఆ నిధులనే హమాస్‌ దాడులకు వినియోగించారని రిపబ్లికన్‌ పార్టీ ఆరోపిస్తోందన్నారు. ఇదే సయమంలో హమాస్‌ దాడులు దారుణమైనవని, సాయుధ బలగాలతో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవడానికి అన్ని హక్కులూ ఇజ్రాయెల్‌కు ఉన్నాయన్నారు. 

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌లో హమాస్‌ దాడులను భారత్‌ కూడా ఖండించింది. ఇజ్రాయెల్‌లో దాడులపై ప్రధాని మోదీ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదులు భీకర దాడుల వార్తలు విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా.

ఈ సమయంలో మా ఆలోచనలు, ప్రార్థనలన్నీ.. బాధిత పౌరులు, వారి కుటుంబాల గురించే. ఈ విపత్కర పరిస్థితుల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడుతాం’ అని స్పష్టం చేశారు. ఇక, మోదీ మద్దతుపై ఇజ్రాయెల్‌ స్పందిస్తూ.. ఆపదలో భారత్‌ మద్దతుగా నిలిచినందుకు ప్రధాని మోదీకి థ్యాంక్స్‌ చెప్పారు. 

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో హమాస్‌ భీకర దాడులు.. ఈ మిలిటెంట్లు ఎవరంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement