ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు.
నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి.
చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment