మలాంగ్ ఆస్పత్రిలో మృతదేహాలు; తొక్కిసలాట సందర్భంగా టియర్‌గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు
మలాంగ్(ఇండోనేషియా): ప్రపంచ క్రీడా చరిత్రలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాకర్ స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు పోలీసులు సహా 125 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఓడిపోయిన జట్టు మద్దతుదారులు క్రీడా స్ఫూర్తిని మర్చిపోయి ఆగ్రహావేశాలతో ఘర్షణకు దిగడం రణరంగానికి దారితీసింది. ఇండోనేషియాలో తూర్పు జావా ప్రావిన్స్‌లోని మలాంగ్ సిటీలో కంజురుహాన్ స్టేడియంలో శనివారం ఈ దారుణం జరిగింది. ఇప్పటిదాకా 125 మంది మృత్యువాత పడ్డారు. తొక్కిసలాటలో మరో 100 మందికిపైగా ప్రేక్షకులు గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 11 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
భాష్పవాయువు ప్రయోగంతో అలజడి
కంజురుహాన్ స్టేడియంలో తూర్పు జావాకు చెందిన అరెమా ఎఫ్‌ఎస్ జట్టు, సురబయాకు చెందిన పెర్సిబయా జట్టుకు మధ్య శనివారం సాయంత్రం ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. 32,000 మంది ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వీరంతా అతిథ్య జట్టు అరెమా ఎఫ్‌ఎస్ మద్దతుదారులే. పెర్సిబయా జట్టు చేతిలో అరెమా జట్టు 3–2 తేడాలో ఓటమి పాలయ్యింది. ఈ పరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. క్రీడాకారులపై, సాకర్ అధికారులపై నీళ్ల సీసాలు, చేతిలో ఉన్న వస్తువులు విసిరారు. దాదాపు 3,000 మంది బారికేడ్లు దాటుకొని ప్రధాన మైదానంలోకి ప్రవేశించారు. అరెమా జట్టు మేనేజ్‌మెంట్‌తో ఘర్షణకు దిగారు.
సొంత గడ్డపై 23 ఏళ్లుగా విజయాలు సాధిస్తున్న అరెమా టీమ్ ఇప్పుడెందుకు ఓడిపోయిందో చెప్పాలంటూ నిలదీశారు. అరుపులు కేకలతో హోరెత్తించారు. మరికొందరు స్టేడియం బయటకువెళ్లి, అక్కడున్న పోలీసు వాహనాలను ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. భాష్పవాయువు గోళాలు స్టేడియంలోకి సైతం దూసుకెళ్లాయి. స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు భయాందోళనకు గురయ్యారు.
బాష్పవాయువును తప్పించుకోవడానికి అందరూ ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట మొదలయ్యింది. ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఊపిరాడని పరిస్థితి. స్టేడియంలోనే 34 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రులకు తరలిస్తుండగా కొందరు, చికిత్స పొందుతూ మరికొందరు మృతిచెందారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనతో ఇండోనేషియా సాకర్ అసోసియేషన్ ప్రీమియర్ సాకర్ లీగ్ లిగా–1ను నిరవధికంగా వాయిదా వేశారు.
ఇదే చివరి విషాదం కావాలి: జోకో విడోడో
ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట జరగడం, 125 మంది మరణించడం పట్ల ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం టీవీలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇదే చివరి క్రీడా విషాదం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాటి దారుణాలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా క్రీడాస్ఫూర్తిని పాటించాలని, మానవత్వం, సోదరభావాన్ని కలిగి ఉండాలని కోరారు. మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కీడ్రలు, యువజన శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు జోకో విడోడో ఆదేశాలు జారీ చేశారు.
ఇండోనేషియా సాకర్ ప్రతిష్టకు మచ్చ
జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో సాకర్ మ్యాచ్‌లకు తాము సన్నద్ధం అవుతున్న తరుణంలో స్టేడియంలో అభిమానులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఇండోనేషియా క్రీడలు, యువజన శాఖ మంత్రి జైనుదిన్ అమాలీ చెప్పారు. ఈ ఘటన తమ దేశ సాకర్ క్రీడా ప్రతిష్టను మసకబార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మే 20 నుంచి జూన్ 11 వరకు జరిగే ఫీఫా యూ–20 ప్రపంచ కప్‌నకు ఇండోనేషియా అతిథ్యం ఇవ్వబోతోంది. ఇందుకోసం ఏర్పాట్లు సైతం ప్రారంభించింది. నిజానికి ప్రపంచ సాకర్ క్రీడా సమాఖ్య ‘ఫిఫా’ నిబంధనల ప్రకారం స్టేడియంలో బాష్పవాయువు ప్రయోగించకూడదు. దేశీయంగా జరిగే క్రీడలపై ఫిఫా నియంత్రణ లేకపోవడం కొన్నిసార్లు పరిస్థితి అదుపు తప్పుతోంది.
ఆట చూసేందుకు వచ్చి అనంత లోకాలకు..
ప్రపంచ క్రీడాలో చరిత్రలో ఇప్పటిదాకా ఎన్నో విషాదాలు చోటుచేసుకున్నాయి. మైదానాలు రక్తసిక్తమయ్యాయి. ఆట చూసి ఆనందించేందుకు వచ్చిన అభిమానులు విగతజీవులయ్యారు. ఎంతోమంది క్షతగాత్రులుగా మారారు. విషాదాలు కొన్ని..
1979 డిసెంబర్ 3: అమెరికాలోని సిన్సినాటీలో రివర్‌ఫ్రంట్ మైదానంలో తొక్కిసలాట జరిగింది. 11 మంది మృతి చెందారు.
1980 జనవరి 20: కొలంబియాలోని సిన్సిలెజె పట్టణంలో బుల్‌ఫైట్ కోసం తాత్కాలికంగా కర్రలతో నిర్మించిన నాలుగు అంతస్తుల స్టేడియం కూలిపోయింది. ఈ ఘటనలో 200 మంది
బలయ్యారు.
1988 మార్చి 13: నేపాల్‌లోని ఖాట్మాండు స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అకస్మాత్తుగా వడగళ్ల వాన మొదలయ్యింది. స్టేడియంలో తొక్కిసలాట జరిగి 93 మంది చనిపోయారు.
1989 ఏప్రిల్ 15: ఇంగ్లాండ్‌లోని షెఫీల్డ్‌లో హిల్స్‌బరో స్టేడియంలో అభిమానుల నడుమ ఘర్షణ జరిగింది. 97 మంది మరణించారు.
1996 అక్టోబర్ 16: గ్వాటెమాలాలోని గ్వాటెమాలా సిటీలో సాకర్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్వాటెమాలా, కోస్టారికా అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 84 మంది విగత జీవులుగా మారారు.
2001 మే 9: ఘనా రాజధాని అక్రాలో స్టేడియంలో ఘర్షణ, అనంతరం తొక్కిసలాట. 120 మందికిపైగా ప్రేక్షకులు బలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment