న్యూఢిల్లీ: భారతీయ విదేశాంగ మంత్రిత్వశాఖ కెన్యాలో ఉంటున్న భారతీయులకు అలర్ట్‌జారీ చేసింది. పన్నుల పెంపును నిరసిస్తూ అక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.
‘‘ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కెన్యాలోని భారతీయులందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పరిస్థితి సద్దుమణిగే వరకు.. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు’’ అని కెన్యాలోని భారతీయ దౌత్య కార్యాలయం ఎక్స్ ద్వారా సూచించింది. మరింత సమాచారం కోసం స్థానిక వార్త ఛానెల్స్‌ను, అలాగే.. దౌత్య సంబంధిత వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలని సూచించింది.
ADVISORY FOR INDIAN NATIONALS IN KENYA
In view of the prevailing tense situation, all Indians in Kenya are advised to exercise utmost caution, restrict non-essential movement and avoid the areas affected by the protests and violence till the situation clears up.— India in Kenya (@IndiainKenya) June 25, 2024
ఇదిలా ఉంటే.. కెన్యాలో పన్నుల పెంపు చట్టానికి ఆ దేశ పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే సమయంలోనే పార్లమెంట్ భవనం బయట నిరసనలు కొనసాగాయి. ‘‘కెన్యా ఇంకా వలస పాలనలోనే మగ్గిపోతోందని.. తమ దేశాన్ని తాము రక్షించుకుని తీరతామని’’ నినాదాలు చేస్తూ వేల మంది యువత ఒక్కసారిగా చట్టసభలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఉన్న భవనంలోని కుర్చీలు, బల్లలు, తలుపులు, అద్దాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. ఈ క్రమంలో ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందగా, 20 మంది దాకా గాయపడ్డారని ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ఇచ్చింది. అయితే ఈ సంఖ్యే ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం.
ఆందోళనలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సోదరి, కెన్యా ఉద్యమకారిణి అవుమా ఒబామా కూడా ఉన్నారు. టియర్‌గ్యాస్ దాడిలో ఆమె సైతం అస్వస్థతకు లోనైనట్లు సమాచారం.
ఏమిటీ బిల్లు..
కెన్యాలో ప్రతిపాదిత పన్ను సంస్కరణలకు మొదటి నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పన్ను సంస్కరణల పేరుతో బ్యాంకు ఖాతాల నగదు లావాదేవీలపై, డిజిటల్ మనీ చెల్లింపులపై, వంట నూనెలపై, ఉద్యోగుల వేతనాలపై, మోటారు వాహనాలపై పన్నులను పెంచుతూ కెన్యా ప్రభుత్వం మనీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ బిల్లును ఆమోదించవద్దని చట్టసభ్యుల్ని కోరుతూ నిరసనకారులు పార్లమెంటును చుట్టుముట్టారు. ఈ ఆందోళనలు ఇప్పుడు ఉధృత రూపం దాల్చి.. దేశమంతటా విస్తరించాయి.
Comments
Please login to add a commentAdd a comment