కెనడా: భవిష్యత్తుపై కోటి ఆశలతో కెనడా వెళ్లి అక్కడి యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్న 700 మంది భారత విద్యార్ధులు ఫేక్ ఆఫర్ లెటర్లతో చొరబడ్డారన్న ఆరోపణలతో బహిష్కరణ వేటు విధించింది కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీ. దీంతో భారత విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ మాపై బహిష్కరణ వేటును ఎత్తివేయకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మరో శరణ్యం లేదని వాపోయారు.
ఆస్తులు తాకట్టు పెట్టి మరీ వచ్చాము...
ఆందోళన చేస్తున్నవారిలో ఒక విద్యార్థి చెప్పిన కథనం ప్రకారం... 2018లో కెనడాలో చదువుకోవాలన్న తపనతో మేమంతా ఏజెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకోగా ఇక్కడ టాప్ యూనివర్సిటీలో సీట్లున్నాయని చెప్పి మాకు ఆఫర్ లెటర్లు పంపించారు.
మాలో చాలామంది ఇక్కడికి రావడానికి ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టుకుని లేదా అమ్ముకుని వచ్చాము. తీరా వచ్చాక మాకు సీటు వచ్చిన యూనివర్సిటీల్లో సీట్లన్నీ అయిపోయాయని మరో యూనివర్సిటీలో చేరతారా అని ఏజెంట్లు అడిగారు.
ఏడాది వృధా అవుతుందేమోనని...
ఎదురు చూస్తూ కూర్చుంటే ఏడాది వృధా అయిపోతుందని, ఎలాగోలా చదువుకోవాలన్న ఆలోచనతో వేరే యూనివర్సిటీ అయినా పర్వాలేదన్నాము. ఆ యూనివర్సిటీల్లో చేరేందుకు మాకు ఇచ్చిన లెటర్లు ఫేక్ వని మాకు తెలియదు. అయినా కూడా హ్యాపీగా చదువుకున్నాం. కొంతమందికి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి.
తీరా ఇప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా మావన్నీ ఫేక్ ఆఫర్ లెటర్లంటూ మాపై వేటు చేశారు. ఈ పరిస్థితుల్లో మమ్మల్ని భారత ప్రభుత్వ పెద్దలు ఆదుకోకుంటే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు మరో మార్గం లేదని అన్నారు.
కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు
ఈ మేరకు పంజాబ్ ఎన్నారై మంత్రి కుల్దీప్ సింగ్ ధాలీవాల్ కెనడా విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా చూడమని అభ్యర్థిస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా కెనడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. కెనడా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రష్యా నుంచి.. మరో ఎయిరిండియా విమానంలో తరలింపు
Comments
Please login to add a commentAdd a comment