గాజా సిటీ: ఇజ్రాయెల్ సైనిక దళాలు, పాలస్తీనా హమాస్ తీవ్రవాదుల మధ్య పోరు ఉధృతరూపం దాలుస్తోంది. ఇరువర్గాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. శాంతి స్థాపనకు కట్టుబడి ఉండాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఇజ్రాయెల్, హమాస్ పెడచెవిన పెడుతున్నాయి. గాజా సిటీలో శుక్రవారం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకు పడుతుండడంతో పాలస్తీనియన్లు తమ పిల్లలు, వస్తువులను వెంట తీసుకొని శివారు ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలు కనిపించాయి.
ఇజ్రాయెల్ దూకుడుతో పాలస్తీనియన్లు బెంబేలెత్తిపోతున్నారు. గాజా సిటీ శివారులో నివసించే పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి నిర్వహించే పాఠశాలల్లో తల దాచుకునేందుకు తరలి వస్తున్నారు. హమాస్ తీవ్రవాదులు తమపై భూమార్గం ద్వారా దండెత్తే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. అందుకే విరుగుడు చర్యగా తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని అంటోంది. పాలస్తీనా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ తన సైన్యాన్ని భారీగా మోహరిస్తోంది. యుద్ధ సన్నాహాలను ముమ్మరం చేస్తోంది. 9,000 మంది రిజర్విస్ట్ సైనికులను రప్పిస్తోంది. యుద్ధ ట్యాంకులను కూడా రంగంలోకి దించుతోంది.
126 మంది పాలస్తీనియన్ల మృతి
పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,800 రాకెట్లు ప్రయోగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ 600కు పైగా వైమానిక దాడులు సాగించింది. కొన్ని భవనాలను నేలమట్టం చేసింది. టాడ్ పట్టణంలో శుక్రవారం యూదు, అరబ్ అల్లరి మూకలు ఘర్షణకు దిగాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 126 మంది పౌరులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీరిలో 31 మంది చిన్నారులు, 19 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. అలాగే 950 మంది గాయపడ్డారని వెల్లడించింది. తమ సభ్యులు 20 మంది మృతి చెందినట్లు హమాస్, ఇస్లామిక్ జిహాద్ గ్రూప్‌లు ప్రకటించాయి. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు.
శాంతి యత్నాలు విఫలం!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఘర్షణను నివారించేందుకు ఈజిప్టు సాగిస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. శాంతి స్థాపనకు ఖతార్, ఐక్యరాజ్యసమితి కూడా చొరవ చూపుతున్నప్పటికీ మార్పు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment