ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్‌ సైన్యం | Israel warns northern Gaza must be emptied within 24 hours | Sakshi
Sakshi News home page

ఉత్తర గాజాను ఖాళీ చేయండి: ఇజ్రాయెల్‌ సైన్యం

Published Sat, Oct 14 2023 5:10 AM | Last Updated on Sat, Oct 14 2023 7:42 AM

Israel warns northern Gaza must be emptied within 24 hours - Sakshi

గాజా స్ట్రిప్‌ సరిహద్దుల దిశగా వెళ్తున్న ఇజ్రాయెల్‌ ట్యాంకులు

జెరూసలేం: హమాస్‌ మిలిటెంట్లకు కంచుకోట అయిన గాజాపై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్‌ సైన్యం సన్నాహాలు చేస్తోంది. ఉత్తర గాజాను తక్షణమే ఖాళీ చేయాలని, దక్షిణ ప్రాంతానికి తరలివెళ్లాలని శుక్రవారం అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ప్రజల రక్షణ కోసమే ఈ ఆదేశాలిచ్చామని తెలియజేసింది. ఉత్తర గాజాలో 10 లక్షల మంది నివాసం ఉంటున్నారు.

ఇజ్రాయెల్‌ ఆదేశాల మేరకు జనం దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. గాజా మొత్తం జనాభా 20 లక్షలు. అంటే దాదాపు సగం మంది ఇళ్లు విడిచివెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జనంతో కిక్కిరిసిపోయిన దక్షిణ గాజాపై మరింత ఒత్తిడి పెరగనుంది. గత ఏడు రోజులుగా గాజాలోని హమాస్‌ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సేనలు భూభాగ దాడులకు సన్నద్ధమవుతున్నాయి.

పదాతి దళాలు ఆయుధాలు చేబూని అడుగు ముందుకు వేయబోతున్నాయి. హమాస్‌పై భూతల దాడుల కోసం 3 లక్షలకు పైగా రిజర్వ్‌ సైనికులు సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్‌ అధికారులు వెల్లడించారు. గాజా వీధుల్లో మిలిటెంట్ల వేటకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అనధికారికంగా చెబుతున్నారు. అడుగడుగూ జల్లెడ పడుతూ మిలిటెంట్లను సజీవంగా బంధించడమో లేక అంతం చేయడమో జరుగుతుందని అంటున్నారు. ఉత్తర గాజా ఇప్పుడు ‘యుద్ధభూమి’ కాబట్టి, అక్కడ ప్రజలెవరూ ఉండొద్దని సూచించారు.  

యుద్ధం ముగిశాక తిరిగి రావొచ్చు  
ఉత్తర గాజాపై హమాస్‌కు గట్టి పట్టుంది. అగ్రనాయకులంతా అక్కడే మకాం వేశారు. అందుకే తొలి టార్గెట్‌గా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సాధారణ ప్రజలను దక్షిణ గాజాకు పంపించి, ఉత్తర గాజాలో మిలిటెంట్ల ఏరివేత ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. హమాస్‌ స్థావరాలను, సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యమని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

సామాన్య ప్రజలకు నష్టం కలిగించే ఉద్దేశం లేదని, యుద్ధం ముగిసిన తర్వాత వారంతా తిరిగిరావొచ్చని సూచించింది. హమాస్‌ మిలిటెంట్లు జనావాస ప్రాంతాల్లో మకాం వేసి, కార్యకలాపాలు సాగిస్తున్నారు. సాధారణ ప్రజలను కవచంగా వాడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు. ప్రజలను అక్కడి తరలిస్తే మిలిటెంట్ల ముసుగు తొలగిపోతుందని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

ఉత్తర గాజాలో లక్షల మంది పాలస్తీనియన్లను నివాసం ఉంటున్నారు. కీలకమైన గాజా సిటీ ఇక్కడే ఉంది. వెంటనే వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశించడంతో పాలస్తీనియన్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆహారం, నీరు, విద్యుత్‌ వంటి సదుపాయాల గురించి మర్చిపోయామని, ప్రాణాలు కాపాడుకుంటే చాలని భావిస్తున్నామని పాలస్తీనా రెడ్‌ క్రాస్‌ సంస్థ ప్రతినిధి నెబాల్‌ ఫర్సాఖ్‌ వ్యాఖ్యానించారు.  

ఖాళీ చేయించే ఆలోచన మానుకోండి: ఐరాస  
ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం జారీ చేసిన ఉత్తర్వులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. సామూహికంగా జనమంతా ఒకేసారి తరలివెళ్లడం సంక్షోభానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్‌ ఇజ్రాయెల్‌కు సూచించారు. మరోవైపు హమాస్‌ సైతం స్పందించింది. ఉత్తర గాజా నుంచి జనాన్ని తరలించడం వెనుక కుట్రదాగి ఉందని ఆరోపించింది.

ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్‌ సాగిస్తున్న ‘మానసిక యుద్ధాన్ని’ పట్టించుకోవద్దని సూచించింది. వేలాది మంది క్షతగాత్రులు ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నారని, వారిని తరలించడం సాధ్యం కాదని గాజా ఆరోగ్య శాఖ తేలి్చచెప్పింది. ఉత్తర గాజాలో పాఠశాల్లో ఏర్పాటు చేసిన ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో లక్ష మందికిపైగా ఆశ్రయం పొందుతున్నారు. వారిని దక్షిణ గాజాకు తరలించలేమని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.  
­
మధ్యప్రాచ్యంలో నిరసనలు
గాజాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులను ఖండిస్తూ మధ్యప్రాచ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జోర్డాన్, యెమెన్‌లో ప్రదర్శనలు జరిగాయి. జెరూసలేం ఓల్డ్‌ సిటీలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. జెరూసలేంలోని అల్‌–అక్సా మసీదులో ప్రార్థనలు చేసుకునేందుకు 50 ఏళ్ల వయసు దాటినవారిని మాత్రమే ఇజ్రాయెల్‌ పోలీసులు అనుమతించారు.

మసీదు బయట పెద్ద సంఖ్యలో గుమికూడిన పాలస్తీనియన్లపైకి భద్రతా బలగాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాయి. లాఠీచార్జి జరిపాయి. ఈ ఘటనలో కనీసం ఆరుగురు గాయపడ్డారు.  లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో హెజ్బొల్లా మద్దతుదారులు ర్యాలీ చేపట్టారు. ఇజ్రాయెల్‌ నశించాలంటూ నినాదాలు చేశారు. ఇరాన్‌ మద్దతున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై హమాస్‌తోపాటు దాడులు జరిపారు.

మధ్యధరా సముద్ర జలాల్లోని అమెరికా, బ్రిటిష్‌ యుద్ధ నౌకలపై కన్నేసి ఉంచుతామని హెజ్బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ నయీమ్‌ కాశీం హెచ్చరించారు. తాము పూర్తి సన్నద్ధతతో ఉన్నామని, సరైన సమయంలో రంగంలోకి దిగుతామని తెలిపారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇరాన్, పాకిస్తాన్‌లో హమాస్‌కు మద్దతుగా జనం ర్యాలీలు నిర్వహించారు.   

ఇజ్రాయెల్‌ దాడుల్లో 13 మంది బందీలు మృతి!  
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య శుక్రవారం కూడా పరస్పరం దాడులు జరిగాయి. ఏడు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో మృతుల సంఖ్య చేరుకుంది. హమాస్‌ దాడుల్లో ఇజ్రాయెల్‌లో 1,300 మందికిపైగా చనిపోయారు. వీరిలో 247 మంది సైనికులు ఉన్నారు. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో 1,530 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 150 మంది పరిస్థితి ఏమిటన్నది తెలియరావడం లేదు.

గత 24 గంటల్లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో బందీల్లో 13 మంది మృతిచెందారని హమాస్‌ శుక్రవారం ప్రకటించింది. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని స్పష్టంచేసింది. అయితే, వారు ఏ దేశానికి చెందినవారన్న సంగతి బయటపెట్టలేదు. వైమానిక దాడుల్లో 13 మంది బందీలు చనిపోయారంటూ హమాస్‌ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి డేనియల్‌ హగారీ ఖండించారు. తమకు స్పష్టమైన సమాచారం ఉందని, ఎవరూ మృతి చెందలేదని అన్నారు.

ఇజ్రాయెల్‌కు అమెరికా రక్షణ మంత్రి  
అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ అస్టిన్‌ శుక్రవారం ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ పర్యటించిన మరుసటి రోజే లాయిన్‌ అస్టిన్‌ సైతం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అస్టిన్‌ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి గల్లాంట్‌తోనూ భేటీ అయ్యారు. హమాస్‌పై యుద్ధానికి అమెరికా అందించనున్న సైనిక సాయంపై ఆయన చర్చించినట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement