చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగి శోధించడానికి ‘స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్’ (స్లిమ్)ను జపాన్ ఏరో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ‘జాక్సా’ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ల్యాండర్ ముద్దు పేరు ‘మూన్ స్నైపర్’. భారత కాలమానం ప్రకారం ఈ నెల 19వ తేదీ రాత్రి 8:50 గంటలకు జాబిలి నేలపై ‘మూన్ స్నైపర్’ దిగడానికైతే మృదువుగా, సాఫీగానే దిగింది. కానీ.. పక్కకు డొల్లిపోయి ‘వెల్లకిలా పడిన తాబేలు’ మాదిరి తలకిందులు అయింది.
ల్యాండింగ్‌లో సంభవించిన ఈ లోపం కారణంగా ‘జాక్సా’ ప్రస్తుతం భారీ మూల్యమే చెల్లించుకుంటోంది. చంద్రుడిపై తాను దిగడానికి కొన్ని క్షణాల ముందుగా ల్యాండర్ జారవిడిచిన రెండో రోవర్ (లూనార్ ఎక్స్కర్షన్ వెహికల్-2) ఈ ఫొటో తీసింది. సూర్యకాంతిని గ్రహించి, సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసి ల్యాండర్ బ్యాటరీని ఛార్జ్ చేయాల్సిన సౌరఫలకాలు(సోలార్ ప్యానెల్స్)ప్రస్తుతం సూర్యుడికి అభిముఖంగా లేవు.
చదవండి: ‘మూన్ స్నైపర్’ బతికేనా?..
అవి ల్యాండర్ తల భాగంలో (కింది వైపు) సూర్యుడికి వ్యతిరేక దిశలో (ఆవలి వైపు) ఉన్నాయి. చంద్రుడిపై 15 రోజులు పగలు, 15 రోజులు రాత్రి ఉంటాయి. చంద్రుడి ఈక్వెటర్ (చంద్రమధ్యరేఖ)కు దక్షిణంగా షియోలీ బిలం వాలులో సూర్యోదయ వేళలో ల్యాండర్ జాబిలిపై కాలుమోపాల్సింది పోయి ‘తలమోపింది’. ‘మూన్ స్నైపర్’ దిగిన ప్రదేశంలో ఇప్పుడు మధ్యాహ్న సమయం. అంటే.. ల్యాండర్ పై భాగంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుడి కోణం మారి ఎండ కాస్త ఆవలి వైపునకు వెళితే సౌరఫలకాలకు సోకుతుంది.
ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న ‘స్లిమ్’ వ్యోమనౌకలోని ఆన్బోర్డ్ బ్యాటరీలో 12% పవర్ మిగిలివుంది. వ్యోమనౌక సోలార్ ప్యానెళ్లకు సూర్యరశ్మి అందుబాటులోకొస్తే బ్యాటరీని పునఃప్రారంభించాలని (రీ-స్టార్ట్ చేయాలని) ‘జాక్సా’ తలపోస్తోంది. అప్పుడు ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కోలుకునే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయత్నంలో జపాన్ సఫలం కావాలని కోరుకుందాం.
ఆ 100 మీటర్ల స్పాట్‌లోనే దిగాం
అసాధారణ రీతిలో కచ్చితత్వంతో కూడిన (ప్రెసిషన్) ల్యాండింగులో సఫలమైనట్టు ప్రకటించిన జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘జాక్సా’. ఈ నెల 19న చంద్రుడిపై కాలుమోపే ఆఖరి అంకంలో ‘మూన్ స్నైపర్’లోని రెండు ప్రధాన ఇంజిన్లలో ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయిందట. ఫలితంగా వ్యోమనౌక చంద్రుడి ఉపరితలంపై షియోలి బిలం వాలులో సమతాస్థితి తప్పి, దొర్లి, శాస్త్రవేత్తలు నిర్దేశించిన లక్ష్యిత ప్రదేశం నుంచి నెమ్మదిగా 55 మీటర్ల ఆవలకు కొట్టుకెళ్లి అవాంఛిత స్థితి (భంగిమ)లో నిలిచిపోయిందని వెల్లడించిన ‘జాక్సా’. ఇంజిన్ సమస్యే కనుక లేకపోతే నిర్దేశిత ప్రాంతానికి 3-4 మీటర్ల సమీపంలోనే ల్యాండర్ బహుశా దిగి ఉండేదని సంస్థ తెలిపింది. మన ‘చంద్రయాన్-3’లోని ‘విక్రమ్’ ల్యాండర్ మాదిరిగానే ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ కూడా చంద్రుడి ఉపరితలంపై మైనస్ డిగ్రీల్లో ఉండే రాత్రి వేళల అతి చలి ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. మరో వారం రోజుల లోపు సౌరవిద్యుత్ తయారై, దాని సాయంతో మేలుకుంటే ‘మూన్ స్నైపర్’ బతికినట్టు. లేదంటే ఆశలు వదిలివేసుకోవడమే! మరోవైపు... జాబిలి ఉపరితలంపై ముందుగా నిర్ణయించిన ప్రదేశంలోనే (లక్ష్యంగా నిర్దేశించిన 100 మీటర్ల స్థలి) దిగామో, లేదో నిర్ధారించేందుకు ల్యాండర్ పంపిన డేటాను ‘జాక్సా సవివరంగా విశ్లేషిస్తున్నట్టు మరికొన్ని కథనాలు వెల్లడించాయి.
- జమ్ముల శ్రీకాంత్
Comments
Please login to add a commentAdd a comment