అమెరికా గడ్డపై 14 భారతీయ భాషల్లో ప్రచారం | Joe Bidens Campaign Reaches Out To Indo American Voters | Sakshi
Sakshi News home page

అమెరికా గడ్డపై 14 భారతీయ భాషల్లో ప్రచారం

Published Fri, Jul 31 2020 9:46 AM | Last Updated on Fri, Jul 31 2020 10:44 AM

Joe Bidens Campaign Reaches Out To Indo American Voters - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ను ఢీకొంటున్న జో బిడెన్‌ ప్రచార కార్యక్రమం ఇండో-అమెరికన్‌ ఓటర్లను ఆకట్టుకునేలా రూపొందింది. అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపే ఇండో-అమెరికన్‌ ఓటర్లను చేరుకునేందుకు 14 భాషల్లో జో బిడెన్‌ ప్రచార కార‍్యక్రమాన్ని పకడ్బందీగా ప్లాన్‌ చేశారు. కీలక రాష్ట్రాల్లో డెమొక్రటిక్‌, రిపబ్లికన్‌ పార్టీల గెలుపు అవకాశాలను భారత సంతతికి చెందిన ఓటర్లు నిర్ధేశించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన ఇండో-అమెరికన్‌ ఓటర్ల కోసం జో బిడెన్‌ ఆకట్టుకునే నినాదాలతో ముందుకొచ్చారు. ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్‌ జైసా హో’ ( అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి) అంటూ హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో నినాదాలతో హోరెత్తించనున్నారు. చదవండి : అధ్యక్ష ఎన్నికల వాయిదాకు సంకేతాలు

2016లో ఆబ్‌ కీ ట్రంప్‌ సర్కార్‌ ( ఈసారి ట్రంప్‌ ప్రభుత్వం) నినాదం భారతీయుల మనసును తాకిన క్రమంలో డెమొక్రటిక్‌ పార్టీ ప్రచారాన్ని ఏకంగా 14 భారతీయ భాషల్లో చేపట్టేందుకు జో బిడెన్‌ క్యాంపెయిన్‌ వ్యూహకర్తలు సంసిద్ధమయ్యారు. ఇండో-అమెరికన్‌ ఓటర్లను వారి మాతృభాషలోనే చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించామని బిడెన్‌ క్యాంపెయిన్‌ బృందంలో ఒకరైన అజయ్‌ భుటోరియా తెలిపారు.

తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ్‌, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మళయాళీ, ఒరియా, మరాఠీ, నేపాలీ సహా 14 భాషల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు జో బిడెన్‌ ప్రచార బృందంతో అజయ్‌ కసరత్తు సాగిస్తున్నారు. భారత్‌లో హోరెత్తే ఎన్నికల ప్రచారాన్ని చూసిన అనుభవంతో జో బిడెన్‌ క్యాంపెయిన్‌లో ఆ సందడి ఉండేలా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాలో నివసించే ఇండో-అమెరికన్‌ ఓటర్లలో ఆ ఉత్సుకత కనిపించేలా ‘అమెరికా కా నేత..కైసా హో, జో బిడెన్‌ జైసా హో’ నినాదాన్ని ముందుకుతెచ్చామని తెలిపారు. నవంబర్‌ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌తో డెమొక్రటికక్‌ అధ్యక్ష అభ్యర్థిగా జో బిడెన్‌ తలపడనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement