వాషింగ్టన్: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)ల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్‌లో ట్రంప్ పైచేయి సాధించారంటూ బైడెన్ డెమొక్రటిక్ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ట్రంప్‌తో సాగిన డిబేట్‌లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్‌ను ఓడించి తీరతా’’ అని బైడెన్ అన్నారు.
దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్‌లో పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment