
జనం తనవైపే ఉన్నారని వ్యాఖ్యలు
తనతో చర్చకు ట్రంప్ వెనకాడారంటూ విసుర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉంటానని ఎన్నడూ అనుకోలేదంటూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అండర్‌డాగ్‌గానే బరిలో దిగాను. అయితే ప్రజల అండ నాకుంది. వారి అభిమానంతో విజయం సాధిస్తా’’ అంటూ ధీమా వెలిబుచ్చారు. అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా భారత సంతతికి చెందిన హారిస్ పేరు దాదాపుగా ఖరారవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్సాచుసెట్స్‌లోని పిట్స్‌ఫీల్డ్‌లో సుమారు 800 మంది దాతలతో తొలి సమావేశంలో ఆమె మాట్లాడారు.
‘‘ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు రెండు భిన్న విధానాల మధ్య పోటీగా సాగుతున్నాయి. ఒకటి దేశాన్ని భవిష్యత్తు వైపు నడిపేది. మరోటి దేశ ప్రగతిని నిలువరించేది’’ అని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి చురకలు వేశారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యరి్థగా నామినేట్ అయేందుకు అవసరమైన సంఖ్యకు మించి డెలిగేట్లు తనకిప్పటికే మద్దతిచ్చారని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
‘‘మనం ఎలాంటి దేశంలో నివసించాలని అనుకుంటున్నాం? స్వేచ్ఛ, ప్రేమ, చట్టబద్ధ పాలన కలిగిన దేశంలోనా? విద్వేషం, భయం, అశాంతి నెలకొన్న దేశంలోనా?’’ అని ప్రశ్నించారు. తనతో చర్చకు ట్రంప్ ఇప్పటికే వెనుకడుగు వేశారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఆయన తనతో డిబేట్‌కు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘‘లాయర్‌గా అన్ని రకాల వ్యక్తులను చూశా. మహిళలను వేధించిన వారిని, వినియోగదారులను మోసగించి నిలువునా దోచుకున్న వారిని, స్వార్థం కోసం చట్టాలను ఉల్లంఘించిన వారిని దగ్గర్నుంచి గమనించా. అందుకే ట్రంప్ ఏ టైపో కూడా నాకు బాగా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు. తనపై ట్రంప్ అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.
వారంలోనే 20 కోట్ల డాలర్ల విరాళాలు
ఈ కార్యక్రమంలో 4 లక్షల డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా 14 లక్షల డాలర్లు పోగవడం విశేషం. హారిస్ ప్రచారం ప్రారంభించిన వారంలోనే ఏకంగా 20 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,640 కోట్లు)ను విరాళాలుగా సేకరించారు. వీటిలో 66 శాతం తొలిసారిగా విరాళాలిచి్చన వారి నుంచే అందాయని ఆమె బృందం పేర్కొంది. నవంబర్ 5న జరగనున్న ఎన్నికలు హోరాహోరీ కానున్నాయని, కొన్ని రాష్ట్రాల్లోని కొందరు ఓటర్లే నిర్ణాయకంగా మారవచ్చని అభిప్రాయపడింది. ఎన్నికలకు 100 రోజులే ఉండటంతో కమల దేశవ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. 2,300 ప్రచార కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment