సియోల్: గత వైరి వైషమ్యాలను పక్కనబెట్టి స్నేహభావంతో ముందుకొస్తే చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ శుక్రవారం ప్రకటించారు. ‘అంతర్జాతీయంగా ఆర్థిక ఆంక్షల పేరిట మా దేశాన్ని అతలాకుతలం చేస్తున్న మీ మిత్ర దేశం అమెరికాను కాస్త బుజ్జగించండి. తీవ్ర ఆంక్షలను కాస్తయినా సడలించేలా ఒప్పించండి. ఈ షరతులకు ఒప్పుకుంటే మీతో చర్చలకు సదా సిద్ధం’ అని దక్షిణ కొరియాను ఉద్దేశిస్తూ కిమ్ సోదరి జోంగ్ వ్యాఖ్యానించారు. ఓవైపు ఆరు నెలల తర్వాత మళ్లీ క్షిపణి పరీక్షలకు శ్రీకారం చుట్టిన ఉ.కొరియా.. మరో వైపు శత్రుదేశంతో సమాలోచనలకు సిద్ధమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉభయ కొరియాలపై ఇకనైనా యుద్ధమేఘాలు తొలగిపోయి శాంతి కపోతాలు ఎగరాలని ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ద.కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ వ్యాఖ్యానించడంతో ఉ.కొరియా తాజాగా స్పందించింది. ‘ఇంతకాలం తీవ్ర ఉద్రిక్తతలు, శత్రుత్వాలతో రెండు దేశాలకూ ఒనగూరింది శూన్యం. ఇకనైనా నిర్మాణాత్మకమైన చర్చలు మొదలుపెడదాం. మా దేశంతో భేదాభిప్రాయాలను త్యజించి, ద.కొరియా ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలి. బంధాల బలోపేతానికి కృషిచేద్దాం’ అంటూ మూన్ జె ఇన్‌ను ఉద్దేశిస్తూ కిమ్ సోదరి మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. దీనిపై ద.కొరియా స్పందించింది. కిమ్ సోదరి మాటల్లోని అంతరార్థాన్ని పూర్తిగా అర్ధంచేసుకున్నాకే ముందుకెళ్తామని ద.కొరియా పేర్కొంది.
చదవండి: Bill Gates: అమెజాన్, టెస్లా అధినేతలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్...!
Comments
Please login to add a commentAdd a comment