శనివారం విజయానంతరం నూతన అధ్యక్షుడు లై చింగ్ టె, ఉపాధ్యక్షురాలు సియావో బి– ఖిమ్ అభివాదం
తైపీ: చైనాతో విభేదాలు తారస్థాయికి చేరిన వేళ స్వయం పాలిత తైవాన్‌లో శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ వరుసగా మూడోసారి విజయం సాధించింది. కరడుగట్టిన జాతీయవాదిగా పేరొందిన డీపీపీ అభ్యర్థి లై చింగ్ టె నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.
శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రస్తుతంఉపాధ్యక్షుడైన లై 40 శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ప్రత్యర్థులైన చైనా అనుకూల ప్రధాన విపక్షమైన కొమింటాంగ్ (కేఎంటీ) పార్టీ అభ్యర్థి హో యు ఈ 33 శాతం ఓట్లతో ఓటమి చవిచూశారు. మరో విపక్షం తైవాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి కో వెన్ జెకు 26 శాతం ఓట్లు దక్కాయి.
ఎనిమిదేళ్లుగా అధ్యక్షురాలుగా కొనసాగుతున్న తై ఇంగ్ వెన్ చైనా పట్ల అనుసరించిన దూకుడైన విధానాలను లై మరింత ముందుకు తీసుకు వెళ్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తైవాన్ ద్వీపం చుట్టూ ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతోపాటే తైవాన్‌కు దన్నుగా నిలుస్తున్న అమెరికాతోనూ చైనా విభేదాలు తీవ్రతరమయ్యేలా కనిపిస్తున్నాయి. తైవాన్‌కు ఆయుధాల సరఫరాతో పాటు అన్నివిధాలా అమెరికా సహకరిస్తుండటం తెలిసిందే.
పార్లమెంటులో చుక్కెదురు
తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓ పార్టీ వరుసగా మూడుసార్లు నెగ్గడం ఇదే తొలిసారి. కానీ అధ్యక్ష పదవితో పాటే తైవాన్ పార్లమెంటుకు కూడా జరిగిన ఎన్నికల్లో మాత్రం అధికార డీపీపీ ఓటమి చవిచూసింది! 113 స్థానాలకు గాను 51 సీట్లతో సరిపెట్టుకుంది. విపక్ష కేఎంటీ 52, టీపీపీ 8 సీట్లలో నెగ్గాయి. పార్లమెంటులో మెజారిటీ సాధనకు ఆ రెండు పారీ్టలూ చేతులు కలిపే అవకాశాలున్నాయి. అధ్యక్ష పీఠంపై చైనా వ్యతిరేక డీపీపీ కొనసాగనుండగా పార్లమెంటుపై మాత్రం చైనా అనుకూల కేఎంటీ కూటమికి ఆధిపత్యం దక్కేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.
స్వతంత్ర పిపాసి
64 ఏళ్ల లై చింగ్ టె స్వతంత్ర పిపాసిగా, ప్రస్తుత అధ్యక్షురాలు వెన్‌ను మించిన జాతీయవాదిగా పేరొందారు. తైవాన్ స్వతంత్ర దేశమని, ఈ విషయంలో చైనాతో ఎలాంటి చర్చలకూ ఆస్కారం లేదని ఆయన చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. చైనా కూడా లైని విపరీతంగా ద్వేషిస్తుంది. ఆయనను ఎన్నుకుంటే తీవ్ర చర్యలు తప్పవని పోలింగ్ వేళ తైవాన్ ప్రజలను నేరుగానే హెచ్చరించింది.
తైవాన్‌తో యుద్ధమా, శాంతా అన్నది వారి తీర్పును బట్టే ఉంటుందని పేర్కొంది. కానీ ప్రజలు తమ తీర్పు ద్వారా ఆ హెచ్చరికలను బేఖాతరు చేశారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి. డ్రాగన్ దేశం గత 40 ఏళ్లలో తొలిసారిగా ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రజల కొనుగోలు శక్తి శరవేగంగా క్షీణిస్తోంది. దాంతో జిన్‌పింగ్ ప్రతిష్ట నానాటికీ మసకబారుతోంది. ఈ నేపథ్యంలో చైనీయుల మనసు గెలుచుకునేందుకు తైవాన్‌పై ఆయన దూకుడు పెంచే ఆస్కారం లేకపోలేదని భావిస్తున్నారు.
బలప్రయోగం ద్వారా దాన్ని విలీనం చేసుకునే ప్రయత్నించినా ఆశ్చర్యం లేదని పాశ్చాత్య రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు తైవాన్‌లోనూ ఆర్థికాభివృద్ధి బాగా నెమ్మదించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరుగుతున్నాయి. ఇంటా బయటా ఎదురవుతున్న ఈ పెను సమస్యలను కొత్త అధ్యక్షుడు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment