
మాస్కో: ప్రపంచ దేశాలను కలవరపరుస్తున్న ఉక్రెయిన్ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సోమవారం అంతర్జాతీయంగా పలు ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. వీటిలో భాగంగా మాస్కోలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చర్చలు జరపగా, జర్మన్ చాన్స్‌లర్ అమెరికాలో శాంతి యత్నాలు ఆరంభించారు. మరోవైపు యథావిధిగా ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని రష్యాను యూఎస్ హెచ్చరించగా, తమకు అలాంటి ఉద్దేశాల్లేవని రష్యా పేర్కొంది. ఈ నేపథ్యంలో మాక్రాన్ సోమవారం పుతిన్‌తో సమావేశమవుతున్నారు.
అనంతరం ఆయన ఉక్రెయిన్‌కు వెళ్లి చర్చలు జరుపుతారు. రష్యాతో చర్చలు జరిపి ఉద్రిక్తతలు నివారించడమే తన ప్రాధాన్యాంశమని మాక్రాన్ పలుమార్లు చెప్పారు. పుతిన్‌తో సమావేశానికి ముందు ఆదివారం ఆయన బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పలు అంశాలపై వీరి మధ్య చర్చలు సాగాయని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ సార్వభౌమత్వం కాపాడడంపై రాజీ లేదని, ఇదే సమయంలో రష్యాకు స్వీయ రక్షణపై ఉన్న సందేహాలు తీర్చాల్సిందేనని మాక్రాన్ చెప్పారు. మరోవైపు అమెరికాలో బైడెన్‌తో చర్చించిన అనంతరం జర్మన్ చాన్స్‌లర్ షుల్జ్ ఈ నెల 14– 15లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటిస్తారు.
అప్పట్లో కూడా ఆ రెండే
క్రిమియా ఆక్రమణ అనంతరం తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు ఫ్రాన్స్, జర్మనీ 2015లో మధ్యవర్తిత్వం చేశాయి. అప్పటికి రాజీ కుదిరినా, పలు అంశాలపై రష్యా, ఉక్రెయిన్ మధ్య విభేదాలు కొనసాగుతూనే వచ్చాయి. 2019లో చివరిసారి ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ నాయకులు చర్చల కోసం కలిశారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. మరోమారు నాలుగు దేశాల నేతలు సమావేశం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెనెస్కీ కోరుతున్నారు. కానీ ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వడంపై స్పష్టత వస్తేనే చర్చలని రష్యా మొండిపట్టు పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఫ్రాన్స్, జర్మనీల దౌత్యం ఎంతమేర ఫలిస్తుందో చూడాలని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment