2024 సోమవారం ప్రారంభమై మంగళవారంతో ముగియనుంది. ఇప్పుడు మనమంతా 2024 చివరిదశలో ఉన్నాం. ఈ ఏడాది పలు ఆనందాన్నిచ్చే ఘటనలతో పాటు విషాదాన్ని పంచే ఉందంతాలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో విమాన ప్రమాదాలు ఒకటి. ఈ దుర్ఘటనల్లో పలువురు ప్రముఖులు కన్నుమూశారు.
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం
జూలై 24న సౌర్య ఎయిర్‌లైన్స్ విమానం పోఖ్రాకు వెళుతుండగా ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. ఉదయం 11 గంటలకు త్రిభువన్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. 21 ఏళ్ల నాటి ఈ విమానానికి మరమ్మతులు చేసి పరీక్షలకు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కుప్పకూలిన ఇరాన్ అధ్యక్షుని హెలికాప్టర్
మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరాబ్దుల్లాహియాన్ సహా 9 మంది మృతిచెందారు. ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లో మూడు హెలికాప్టర్లు ఉన్నాయి. వీటిలో రెండు హెలికాప్టర్లు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాయి. పలు నివేదికల ప్రకారం పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగమంచు మధ్య పర్వత ప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలోని అజర్‌బైజాన్ సరిహద్దు నగరం జోల్ఫా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రష్యాలో విమాన ప్రమాదం
2024 జనవరిలో రష్యా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 74 మంది మృతిచెందారు. బెల్గోరోడ్ ప్రాంతంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరియు 9 మంది రష్యన్ సిబ్బంది ఉన్నారు. ఈ సంఘటన తర్వాత రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఉక్రెయిన్ నుండి ప్రయోగించిన క్షిపణి విమానాన్ని తాకిందని పేర్కొంది. ఉక్రెయిన్ దీనిని రష్యా కుట్రగా పేర్కొంది.
మలావిలో కూలిన విమానం
ఈ ఏడాది జూన్‌లో మలావీ వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మదిమంది విమాన ప్రమాదంలో మరణించారు. ఈ విమాన ప్రమాదాన్ని మలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా స్వయంగా ధృవీకరించారు. ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం శకలాలు దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఒక పర్వత ప్రాంతంలో కనుగొన్నారు. సౌలోస్ చిలిమా విమానం అదృశ్యమయ్యే ముందు దక్షిణ ఆఫ్రికా దేశ రాజధాని లిలాంగ్వేకు ఉత్తరాన 370 కిలోమీటర్ల దూరంలో ఎగురుతూ కనిపించింది. అననుకూల వాతావరణం, దృశ్యమానత సరిగా లేకపోవడం కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది.
హాలీవుడ్ నటుని దుర్మరణం
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఆలివర్ అతని ఇద్దరు కుమార్తెలు, పైలట్ జనవరి ఆరున కరేబియన్ ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో కన్నుమూశారు. గ్రెనడైన్స్‌లోని పెటిట్ నెవిస్ ద్వీపంలో ఈ విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కూలిపోయింది.
చిలీ మాజీ అధ్యక్షుడి హెలికాప్టర్..
చిలీ మాజీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా ఈ ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన వ్యక్తిగత హెలికాప్టర్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో నలుగురు ఉన్నారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో విమాన ప్రమాదం
జనవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్ ప్రావిన్స్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఈ బిజినెస్ జెట్‌లో ఏడుగురు రష్యన్లు ఉన్నారు. వారు అక్కడికక్కడే మృతిచెందారు. విమానం ఇంజన్‌లో లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. విమానం మొరాకో కంపెనీకి చెందినది.
ఇది కూడా చదవండి: Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
Comments
Please login to add a commentAdd a comment