మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఒక్కసారిగా మాటమార్చారు. ఇన్ని రోజులు భారత్, ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కిన ముయిజ్జు సడెన్‌గా మాట మార్చారు. మాల్దీవులకు భారత్ ఎప్పటకీ సన్నిహిత మిత్రుడే అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన ఇలా ఎందుకు మాట్లాడారంటే?..
గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రాధేయపడుతున్నారు. ఇందులో భాగంగానే కొత్త ప్లాన్ రచించారు. అయితే, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ముయిజ్జు తొలిసారిగా స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని, పెద్ద మొత్తంలో ప్రాజెక్టులను నిర్మించిందని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు ఉపశమనం కలిగించాలని భారత్‌ను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ముయిజ్జు..‘గత ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల భారత్ నుంచి తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోయాయి. తిరిగి చెల్లించడంలో మినహాయింపు కోరుతూ ఆ దేశంతో చర్చలు జరుపుతున్నాం. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టుకు విఘాతం కలిగించం. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసేందుకు సహకరిస్తాం’ అని కామెంట్స్ చేశారు. ఇక, ఇదే విషయాన్ని ప్రధాని మోదీతో దుబాయ్ వేదికగా జరిగిన కాప్ 28 సదస్సు సమయంలోనూ ప్రస్తావించినట్లు తెలిపారు.
After his Continued anti-India rhetoric, Maldives President #MohamedMuizzu has softened his stance towards #Bharat saying Bharat will continue to remain his country's “closest ally” as he sought a debt relief from New Delhi. Maldives owes approximately $400.9 million to India! pic.twitter.com/po89Zaj8Mq
— Sudarshan_World (@Sudarshan_World) March 22, 2024
ఇదిలా ఉండగా.. గత నవంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ముయిజ్జు.. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మే 10 నాటికి భారత్‌కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని ముయిజ్జు గడువు విధించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment