న్యూయార్క్: అబద్ధాలు ఎవరు చెబుతారు? ఎందుకు చెబుతారు? అనే విషయాలపై జరిగిన ఓ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మిగతా వారితో పోలిస్తే మిలీనియల్స్ ఎక్కువ అబద్ధాలు చెబుతారట..! అదేవిధంగా, మహిళల కంటే పురుషులే ఎక్కువగా అబద్ధాలు చెబుతారట! ఆఫీసులో అవమానాల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతా మంటూ ఎక్కువ మంది సమాధానమివ్వడం విశేషం. ఆన్‌లైన్ కేసినో ‘ప్లే స్టార్’జరిపిన ఓ సర్వేలో ఇవి వెల్లడయ్యాయి.
అమెరికాలోని కొలరాడో, ఇలినాయీ, న్యూజెర్సీ, న్యూయార్క్, పెన్సిల్వేనియా, టెన్నెస్సీ, విస్కాన్సిన్ రాష్ట్రాలకు చెందిన కొందరిపై ప్లేస్టార్ సర్వే చేపట్టింది. వీరిలో సగం మహిళలు కాగా, మిగతా సగం పురుషులు. పలు వయస్సుల వారు వివిధ సందర్భాల్లో ఎలా అబద్ధాలు చెబుతారో నమోదు చేసింది.
ఈ విషయంలో 1981–1996 సంవత్సరాల మధ్య పుట్టిన మిలీనియల్స్ మొదటి స్థానంలో నిలిచారు. ఈ వయస్సు వారిలో 13 శాతం మంది రోజులో ఒక్కసారైనా అబద్ధం చెబుతామంటూ ఒప్పుకున్నారు. అదే బేబీ బూమర్స్..1946–1964 సంవత్సరాల మధ్య పుట్టిన వారిలో ఇది రెండు శాతమే ఉంది. ఈ విషయంలో 1997–2021ల మధ్య జన్మించిన జనరేషన్ జెడ్, 1965–1980 మధ్య పుట్టిన జనరేషన్ ఎక్స్ వారి ప్రవర్తన ఒకే విధంగా ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రూపుల వారిలో కేవలం 5 శాతం మంది రోజూ కనీసం ఒక్కసారి అబద్ధమాడుతామని చెప్పారు.
ఎందుకు అబద్ధం?
సర్వేలో పాల్గొన్న మిలీనియల్స్‌లో మూడో వంతు మంది ఈ ఏడాదిలో రెజ్యుమెలో వివరాలను తారుమారు చేసినట్టుగా అంగీకరించారు. పని చేసే ప్రాంతంలో అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు బాస్‌కు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో ప్రతి అయిదుగురిలో ఇద్దరు అంగీకరించారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా. ఎదుటి వారి దృష్టిలో పడేందుకు అబద్ధాలు చెబుతామంటూ మిలీనియల్స్‌లో 23 శాతం మంది, జెడ్ జనరేషన్‌లో 21 శాతం మంది అంగీకరించారని ప్లే స్టార్ సర్వేలో తేలింది.
మిలీనియల్స్‌లో మెజారిటీ మంది దృష్టంతా డబ్బు, కీర్తి ప్రతిష్టల సంపాదనపైనే ఉంటుందని 2012లో పర్సనా లిటీ అండ్ సోషల్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా చెప్పిందని ప్లే స్టార్ గుర్తు చేసింది. అయితే ఇందుకు విరుద్ధంగా, సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది ఆన్‌లైన్‌లో ఎన్నడూ మోసం చేయలేదని చెప్పుకున్నారని సర్వే తెలిపింది. మిగతా జనరేషన్స్ వాళ్లు మాత్రం నిజాయతీయే ఉత్తమమని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఏడాది పూర్తి స్థాయిలో నిజాయతీగా ఉంటామంటూ జనరేషన్ ఎక్స్‌కు చెందిన ప్రతి 10 మందిలో 9 మంది, బేబీ బూమర్స్ జనరేషన్‌కు చెందిన ప్రతి అయిదు గురిలో నలుగురు సమాధానమిచ్చారు.
పురుషులు అబద్ధాల్లో ముందు
మహిళలతో పోలిస్తే సోషల్ మీడియాలో పురుషులు 10% ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారని సర్వే గుర్తించింది. రోజులో ఒక్క సారైనా అబద్ధం చెబుతామని మహిళల్లో 23 శాతం మంది ఒప్పుకోగా, అదే పురుషుల్లో ఇది 26 శాతంగా ఉండటం విశేషం. ఎదుటి వాళ్లు చెప్పేది అబద్ధమా కాదా అనే విషయాన్ని 97% మంది వరకు గుర్తించలేక పోతున్నారని కూడా సర్వే గుర్తించింది.
అదేవిధంగా, చెప్పిన ప్రతి అబద్ధమూ హానికరం కాదన్న విషయం సర్వేలో వెల్లడైంది. అవమానకర పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకంటూ 58 శాతం మంది, గోప్యతను కాపాడుకునేందుకు 42% మంది, ఇతరులకు ఇబ్బంది రాకూడదని 42% మంది అబద్ధమాడుతామని చెప్పడం విశేషం.
ఇదీ చదవండి: వీడు హీరో అయితే.. ఏ మిషనైనా పాజిబుల్!
Comments
Please login to add a commentAdd a comment