ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి.. | Passengers run off after plane makes emergency landing in Spain | Sakshi
Sakshi News home page

ఎంత మోసం.. మాయరోగం నటించి విమానాన్ని దారి మళ్లించి..

Published Sun, Nov 7 2021 4:48 AM | Last Updated on Sun, Nov 7 2021 7:45 AM

Passengers run off after plane makes emergency landing in Spain - Sakshi

పాల్మా(స్పెయిన్‌): మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ మనుషులు పరాయి దేశాలకు వలస వెళ్లడం సర్వసాధారణం. కొందరు చట్టబద్ధంగా వెళ్తే.. ఆ అవకాశం లేని మరికొందరు అక్రమంగా మరో దేశంలోకి ప్రవేశిస్తుంటారు. పుట్టిన గడ్డపై బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాణాలను పణంగా పెట్టి మరీ విదేశాలకు వలస వెళ్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఇదొక కొత్త రకం అక్రమ వలస. శుక్రవారం స్పెయిన్‌లో చోటుచేసుకుంది.

ఎయిర్‌ అరేబియా విమానం మొరాకోలోని కాసాబ్లాంకా నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు బయలుదేరింది. ఇందులో చాలామంది మొరాకో దేశస్తులున్నారు. మార్గమధ్యంలో ఓ ప్రయాణికుడు తనకు అనారోగ్యమంటూ విలవిల్లాడాడు. దీంతో విమానాన్ని స్పెయిన్‌ దేశానికి చెందిన పాల్మా డి మాలోర్కా దీవిలో ఉన్న ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. ఇది స్పెయిన్‌లో బిజీ ఎయిర్‌పోర్టు. ఇక్కడి నుంచి నిత్యం వందలాది విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

బాధిత ప్రయాణికుడికి చికిత్స అందించేందుకు(మెడికల్‌ ఎమర్జెన్సీ) ఎయిర్‌ అరేబియా ఫ్లైట్‌ను మాలోర్కా ఎయిర్‌పోర్టులో దించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి వెంట ఓ సహాయకుడు ఉన్నాడు. విమానంలో ఆగడంతో ఇదే అదనుగా భావించి దాదాపు 22 మంది కిందికి దిగి, పరుగులు ప్రారంభించారు. కొందరు ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని బయటకు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.12 మందిని పట్టుకున్నారు.

మిగిలిన వారికోసం గాలిస్తున్నారు. ఈ గందరగోళం కారణంగా విమానాశ్రయాన్ని శుక్రవారం 4 గంటలపాటు మూసివేయాల్సి వచ్చింది. దాదాపు 60 విమానాలను దారి మళ్లించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రయాణికుడు అనారోగ్యం అంటూ విమానంలో నాటకం ఆడినట్లు తేలింది. అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు గుర్తించారు. ప్రయాణికుడి వెంట వచ్చిన సహాయకుడు సైతం పరారయ్యాడు. ఇలాంటి సంఘటన తమ ఎయిర్‌పోర్టులో ఎప్పుడూ జరగలేదని అధికారులు చెప్పారు. స్పెయిన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికే మొరాకో దేశస్తులు ఈ కుట్ర పన్నినట్లు గుర్తించారు. 
(చదవండి: టెక్సాస్‌ మ్యూజిక్‌ ఫెస్ట్‌లో తొక్కిసలాట)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement