వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’ | Potato Milk Trending Swedish Company Develops And Launch Soon In Europe | Sakshi
Sakshi News home page

వెరైటీ అంటే ఇదే.. గేదె, ఆవు పాలు కాదు.. ‘ఆలూ పాలు’

Published Sat, Feb 12 2022 1:33 PM | Last Updated on Sat, Feb 12 2022 3:21 PM

Potato Milk Trending Swedish Company Develops And Launch Soon In Europe - Sakshi

సాధారణంగా పొద్దున్నే ఎవరి ఇళ్లలోనైనా రోజు ఎలా మొదలవుతుంది? టీ, కాఫీ లేదా పాలు తాగడంతోనే కదా.. మరి ఇందుకోసం మీరు ఏ పాలు వాడతారని అడిగితే... గేదె పాలు, ప్యాకెట్‌ పాలు లేదా ఆవు పాలని టక్కున బదులిస్తారు. మరి ఆలూ పాల గురించి మీరెప్పుడైనా విన్నారా? ఆలుగడ్డతో చేసే వంటకాల గురించి తెలుసుగానీ ఆలూతో పాలు ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? 

అదే మరి వెరైటీ అంటే... సోయా మిల్క్, ఆల్మండ్‌ మిల్క్, ఓట్‌ మిల్క్‌ తరహాలోనే తాజాగా ఆలూ మిల్క్‌ మార్కెట్లోకి వచ్చేసింది. ప్రపంచంలోనే వాణిజ్య పద్ధతిలో ఆలుగడ్డల నుంచి పాలను తయారు చేసే ఏకైక స్వీడన్‌ కంపెనీ అయిన ‘డగ్‌’ ఈ పాలను తాజాగా యూకేలో ప్రవేశపెట్టింది. జంతువుల నుంచి సేకరించే పాలలాగానే ఆలూ పాలు కూడా చిక్కగా, రుచికరంగా ఉంటాయని కంపెనీ చెబుతోంది. కాఫీ తరహాలో ఉండే లాట్టెస్, కాపిచీనో తయారు చేసుకొనేందుకు ఈ పాలు ఎంతో బాగుంటాయని తెలిపింది. త్వరలోనే ఇతర యూరోపియన్‌ దేశాలతోపాటు చైనాలో ఆలూ పాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు వివరించింది. 

స్పందన భారీగానే... 
మాల్టోడెక్స్‌ట్రిన్, పీ ప్రొటీన్, చికోరీ ఫైబర్, ర్యాప్‌సీడ్‌ ఆయిల్, ఫ్రక్టోస్, సూక్రోస్‌ సహా వివిధ విటమిన్లతో కూడిన ఆలూ పాలను కొనేందుకు ప్రస్తుతం యూకేవాసులు పోటీపడుతున్నారట. ముఖ్యంగా ఇది వెగాన్‌ ఫ్రెండ్లీ (అంటే జంతురహిత ఉత్పత్తి) కావడంతో శాకాహారులంతా ఈ ఆలూ పాలు కొనేందుకు ఉత్సాహం చూపుతున్నారట. అలాగే జంతువుల నుంచి సేకరించే పాలలో ఉండే లాక్టోస్‌ (ఒక రకమైన చక్కెర) కొందరికి జీర్ణం కాదు. ‘డగ్‌’ తయారు చేసే ఆలూ పాలు లాక్టోస్‌రహితమైనవి కావడం వల్ల కూడా చాలా మంది ఈ పాలు తాగుతున్నారట. దీని ధర సైతం ఆల్మండ్‌ మిల్క్, సోయా మిల్క్‌తో పోలిస్తే చవకగానే (లీటరుకు సుమారు రూ. 170కి విక్రయిస్తోంది) ఉందని వినియోగదారులు చెబుతున్నారు. 

రుచి అంతంతే..! 
అయితే దీన్ని రుచి చూసిన వారిలో కొందరు మాత్రం ఆలూ పాలు అంత గొప్పగా లేవని చెబుతున్నారు. దాని రుచి ‘తటస్థం’గా ఉందని కొందరంటే ఇంకొందరేమో ఆలూ పాలు కాస్త ‘ఉప్ప’గా ఉన్నాయని పెదవి విరుస్తున్నారు. సోయా మిల్క్‌లో ఉండే 8 గ్రాముల ప్రొటీన్, ఓట్‌ మిల్క్‌లో ఉండే 3 గ్రాముల ప్రొటీన్‌లతో పోలిస్తే ఆలూ మిల్క్‌లో కేవలం ఒక గ్రాము ప్రొటీన్‌ (ఒక సర్వింగ్‌కు) మాత్రమే ఉందని ఇంకొందరు పేర్కొన్నారు. అయితే సోయా పాలలో లభించే ప్రొటీన్లకన్నా నాలుగురెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఆలూ పాలలో ఉన్నాయని కంపెనీ తెలిపింది.   

ఆలూనే ఎందుకు? 
సోయా, ఓట్‌ మిల్క్‌తో పోలిస్తే ఆలుగడ్డను తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువగా సాగు చేసేందుకు అవకాశం ఉండటం, వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు వీలుండటంతో ఆలూ నుంచి పాల తయారీని లాభదాయక వ్యాపారంగా ఎంచుకున్నట్లు ‘డగ్‌’ చెబుతోంది. అలాగే తక్కువ నీటి వాడకంతోనే ఆలూ పంట చేతికొచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు మరో కారణమని కంపెనీ తెలిపింది. అన్నింటికీ మించి ఇతర పాలతో పోలిస్తే కారుచౌకగా ‘ముడిసరుకు’ లభిస్తుందని పేర్కొంది. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement