సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్‌కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్‌ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్ వెకేషనింగ్’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?
అమెరికన్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్‌లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్‌ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.
పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్ వెకేషనింగ్ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్ వెకేషనింగ్ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్‌ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.
మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్‌ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment