లండన్: బ్రిటన్‌లో ప్రధాని రిషి సునాక్ కేబినెట్ నుంచి గవిన్ విలియమ్సన్ రాజీనామా చేశారు. తోటి ఎంపీలపై నోరుపారేసుకుంటారని, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తారని ఆయనపై గతంలోనే విమర్శలు ఉన్నాయి. తాజా కన్జర్వేటివ్ పార్టీ మాజీ చీఫ్ విప్ విండీ మోర్టాన్‌ను ఆయన బెదిరించారని ఆరోపణలున్నాయి.
మాజీ మహిళా ప్రధాని లిజ్ ట్రస్‌కు సాయపడలేదని, బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు తనను ఆహ్వానించలేదని తిడుతూ విండీకి విలియమ్‌సన్ చేసిన మెసేజ్‌లు ఇటీవల మీడియాలో బహిర్గతమవడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా.. ప్రధాని అండ కారణంగానే ఆయన్ని తప్పించడం లేదంటూ చర్చలు మొదలయ్యాయి. ఈ తరుణంలో.. మంగళవారం విలియమ్సన్ రాజీనామా చేశారు.
ఇదిలా ఉంటే.. విలియమ్సన్‌ను గతంలోనూ రెండుసార్లు పదవి నుంచి తప్పించారు. మూడేళ్లక్రితం రక్షణమంత్రిగా ఉన్న కాలంలో నేషనల్ సెక్యూరిటీ అంశంతో పాటు ఉద్యోగులను నాలుక చీలుస్తానని, కోపంతో కిటికీ నుంచి బయటకు విసిరేస్తానని అరిచేవారని వార్తలొచ్చాయి. ఆపై గతేడాది విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనూ ఆయనపై విమర్శలు వచ్చాయి. కరోనా పరిస్థితులను హ్యాండిల్ చేయకపోవడం, స్కూళ్ల నిర్వహణ అంశాల ఆధారంగా వివాదంలో చిక్కుకుని పదవి నుంచి దిగిపోయారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తోటి సభ్యులపై దురుసుతనం ప్రదర్శించి పదవి నుంచి దిగిపోయారు.
ఇదిలా ఉంటే తన రాజీనామా లేఖలో ఆరోపణల కారణంగా తప్పుకుంటున్నట్లు విలియమ్సన్ పేర్కొనగా.. రిషి సునాక్ విచారం వ్యక్తంచేశారు. మరోవైపు వివాదాల్లో చిక్కుకున్న వాళ్లను కేబినెట్‌లోకి తీసుకోవడం ప్రతిపక్ష లేబర్ పార్టీ, ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు గుప్పిస్తోంది. రిషి సునాక్ నిర్ణయంపై పోస్ట్‌మార్టం జరుగుతోంది అక్కడ. వివాదాలకు కేరాఫ్ అయిన వాళ్లకు కేబినెట్ పదవులు.. కట్టబెట్టడాన్ని ప్రతిపక్షం ఆయుధంగా చేసుకుంటోంది. ఇప్పటికే బ్రేవర్‌మన్ విషయంలో సునాక్‌పై విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు రిషి సునాక్ తీరుపై సొంతపార్టీలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment