మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ పుతిన్ చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నాలే తనను షాక్ కు గురిచేశాయని తెలిపారు.
పుతిన్ తాజాగా ఖజికిస్తాన్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా తెలివైన వ్యక్తి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా ట్రంప్ వెనుకాడరు. అయితే, ట్రంప్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఆయన ప్రాణాలకు రక్షణ లేదు. అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఎన్నికల సమయంలో ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు జరిగాయి. వీటన్నింటినీ ట్రంప్ అర్థం చేసుకోవాలి అని సూచనలు చేశారు. ఇదే సమయంలో ట్రంప్.. యుద్ధాలను సైతం ఆపేయగలరని పుతిన్ కితాబు ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో పెన్సిల్వేనియాలో ట్రంప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో కాల్చడంతో ట్రంప్ చెవి దగ్గరి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రంప్ చెవికి గాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment