ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై యుద్ధంలో తలమునకలై ఉంది. అత్యాధునిక ఆయుధాలు, అజేయమైన సైనిక బలంలో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన రష్యా ప్రస్తుతం బాలలు, యువకులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 1989లో ఏర్పాటైన ‘సైనికుల తల్లుల కమిటీ’ ఈ విషయాన్ని గురువారం బహిర్గతం చేసింది. కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బాలలను, యువకులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలిస్తున్నారని, అక్కడ మారణాయుధాలు ఇచ్చి, సైనిక శిక్షణ పేరిట చిత్రహింసలు పెడుతున్నారని ఈ కమిటీ ఒక ప్రకటనలో ఆరోపించింది. వారిలో చాలామందిని ఉక్రెయిన్‌లో యుద్ధభూమికి తరలించారని వెల్లడించింది.
చదవండి: (ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?)
కఠినమైన శిక్షణ తట్టుకోలేక పారిపోయేందుకు ప్రయత్నిస్తే చావబాదుతున్నారని, దారుణంగా హింసిస్తున్నారని పేర్కొంది. రష్యావ్యాప్తంగా ఎంతోమంది తల్లుల నుంచి తమకు చాలా ఫోన్‌కాల్స్ వచ్చాయని కమిటీ తెలియజేసింది. బిడ్డల బాగోగులు తెలియక తల్లులు ఆందోళనకు గురవుతున్నారని, కనీసం బతికి ఉన్నారో లేదో కూడా వారికి తెలియడం లేదని కమిటీ డిప్యూటీ చైర్మన్ ఆండ్రీ కురోచ్‌కిన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డలకు దూరమైన తల్లుల రోదనలను ఆపలేకపోతున్నామని చెప్పారు. ఉద్యోగాల్లో చేర్చుకుంటున్నాం, కేవలం శిక్షణ మాత్రమే ఇస్తాం అంటూ మాయమాటలతో మభ్యపెడుతూ సరిహద్దులకు తరలించి, అక్కడి నుంచి నేరుగా రణరంగంలోకి దించుతున్నారని ఆరోపించారు.
చదవండి: (కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్‌స్కీ ప్రస్థానం)
కాంట్రాక్టు జవాన్లుగా మారేందుకు నిరాకరిస్తే ఉన్నతాధికారులు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని తెలిపారు. ఫోన్లు సైతం లాగేసుకుంటుండడంతో సదరు యువకుల పరిస్థితి ఏమిటి, ఎక్కడున్నారు అనేది తెలియడం లేదని పేర్కొన్నారు. యుద్ధరంగంలోకి సుశిక్షితులైన జవాన్లను పంపాలి గానీ ఏమాత్రం అవగాహన లేని బాలలను, యువతను పంపించి, వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం ఏమిటని నిలదీశారు. ఇదొక పెద్ద విపత్తు అని అభివర్ణించారు.
బందీలుగా బాలలు: ఉక్రెయిన్ సైన్యం చేతిలో బందీలుగా ఉన్న కొందరు రష్యా సైనికుల్లో బాలలు, యువత కనిపించారు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న వీరి దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ముక్కుపచ్చలారని బాలలు బందీలుగా మారిపోవడం గమనార్హం. రష్యా సైనికాధికారుల అకృత్యాలపై చీఫ్ మిలటరీ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు ‘సైనికుల తల్లుల కమిటీ’ సన్నద్ధమవుతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువత జీవితాలతో చెలగాటం ఆడొద్దని కమిటీ హితవు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment