మేం ఎంత మంది ఉన్నామో చూశారా.. | Scientists Tally Up The Total Number Of Ants On Earth | Sakshi
Sakshi News home page

మేం ఎంత మంది ఉన్నామో చూశారా..

Published Wed, Sep 21 2022 2:26 AM | Last Updated on Wed, Sep 21 2022 7:32 AM

Scientists Tally Up The Total Number Of Ants On Earth - Sakshi

భూమ్మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయని ఎవరైనా అడిగితే మీరేం చెబుతారు? ఇదేం పిచ్చి ప్రశ్న.. వాటినెలా లెక్కేస్తాం? అని ఎదురు ప్రశ్నిస్తారు. మరి భూమ్మీద ఎన్ని చీమలున్నాయని అడిగితే మీ సమాధానం? మళ్లీ ఇంకో పిచ్చి ప్రశ్న అని తీసిపారేయవద్దు. ఎందుకంటే... జర్మనీలోని జులియస్‌ మాక్స్‌మిలియన్స్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చీమల సంఖ్యను మాత్రమే కాదు.. వాటన్నింటినీ ఒక దగ్గర చేరిస్తే ఎంత బరువు ఉంటాయో కూడా లెక్కలేసి తేల్చేశారు మరి!!

కొంచెం విచిత్రంగా అనిపించినా ఇది నిజమే. భూమ్మీద మొత్తం చీమల సంఖ్యపై ఇప్పటి వరకూ సరైన అంచనా ఏదీ లేకపోవడంతో జర్మనీ శాస్త్రవేత్తలు లెక్కలేసేందుకు నడుం బిగించారు. అంతేకాదు.. చీమల సంఖ్య అడవుల్లో ఎంత ఉంటుంది? ఎడారుల్లోనైతే ఎంత? తేమ ఉన్నచోట?... నగరాల్లో? ఇలా రకరకాల జీవావరణ వ్యవస్థల్లో చీమల ఉనికి ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు వీరు అందుబాటులో ఉన్న పరిశోధన వ్యాసాలన్నింటినీ జల్లెడ పట్టారు.

ఈ అంశంపై ఇప్పటివరకూ ప్రచురితమైన సుమారు 489 అధ్యయనాల సారాంశాన్ని వడపోసి ‘‘ఈ భూమ్మీద మొత్తం 20 క్వాడ్రిలియన్ల చీమలున్నాయి’’ అని తేల్చారు! అంటే 20 పక్కన 15 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట(200 కోట్ల కోట్లు). దీన్నే మరోలా చెప్పాలంటే విశ్వం మొత్తమ్మీద ఉన్న నక్షత్రాలకు 2 వేల రెట్ల ఎక్కువ సంఖ్యలో చీమలున్నాయట! 

అక్కడ ఒక్క చీమా లేదు! 
ఎన్ని ఉన్నాయో తెలిసింది! బరువెంతో కూడా స్పష్టమైంది. మరి.. ఏ ప్రాంతంలో ఎక్కువ చీమలు ఉన్నాయి? ఎక్కడ తక్కువ ఉన్నాయి? ఈ ప్రశ్నలకూ జర్మనీ శాస్త్రవేత్తలు సమాధానాలు కనుగొన్నారు లెండి. భూమధ్య రేఖకు 10 డిగ్రీలు పైన, కింద ఉండే ఉష్ణమండల ప్రాంతాల్లో చీమలు పుట్టలు పుట్టలుగా ఉంటే.. నగర ప్రాంతాల్లో అతితక్కువగా ఉన్నాయట. ధ్రువ ప్రాంతాల్లో ఒక్క చీమ కూడా లేదట. 

అధ్యయనం ఎందుకంటే.. 
చీమల లెక్కలేసేందుకు శాస్త్రవేత్తలు ఎందుకు శ్రమ పడ్డారన్న సందేహం వచ్చిందా? అయితే ఇవి చేసే పనులు తెలిస్తే శాస్త్రవేత్తలు సరైన పనే చేశారని మీరే అంటారు. ఎందుకంటే.. ఒక్కో హెక్టారు నేల నుంచి చీమలు ఏటా 13 టన్నుల మట్టిని అటూఇటు మారుస్తుంటాయట! నేల లోపలి పోషకాలను పైపొరల్లోకి చేర్చడం ద్వారా పంట దిగుబడులను ప్రభావితం చేస్తూంటాయట!! అలాగే విత్తనాలను ఒక ప్రాంతం నుంచి ఇంకో చోటకు చేర్చడంలోనూ చీమలు కీలకపాత్ర పోషిస్తున్నాయని
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్యాట్రిక్‌ షూల్‌థెసిస్‌ వివరించారు.  

బరువు అతి భారీగానే.. 
గండుచీమ, నల్లచీమ, ఎర్ర చీమలన్నింటి సంఖ్యపై ఓ స్పష్టత సాధించిన జర్మనీ శాస్త్రవేత్తలు.. ఆ తరువాత వాటి మొత్తం బరువును అంచనా వేశారు. వేర్వేరు ప్రాంతాలు, జీవావరణ వ్యవస్థల్లోని చీమల రకాలను.. వాటి సగటు బరువులను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. వాటి మొత్తం బరువు కోటీ ఇరవై లక్షల టన్నులని తేలింది! భూమ్మీద ఉన్న అన్ని పక్షులు, మానవులను మినహాయించి మిగిలిన క్షీరదాల మొత్తం బరువు కంటే చీమల బరువే ఎక్కువ కావడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement