కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు నిరంకుశ పాలన సాగిస్తారనే అనుమానాలు బలపడు తున్నాయి. జానపద గాయకుడు ఫవాద్ అందారబీని తాలిబన్లు కాల్చి చంపినట్లు సమాచారం. బఘ్లాన్ ప్రావిన్స్‌లోని అందారబీ వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఒకసారి తాలిబన్లు తమ నివాసానికి వచ్చి, తన తండ్రితో మాట్లాడి టీ తాగి వెళ్లారని ఫవాద్ కుమారుడు జవాద్ అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారు. కానీ, శుక్రవారం తాలిబన్ ముఠాకు చెందిన ఒక వ్యక్తి తుపాకీతో తన తండ్రిని కాల్చి చంపేశాడ న్నారు. దోషిని శిక్షిస్తామని స్థానిక తాలిబన్ నేతలు హామీ ఇచ్చారన్నారు.
‘మా నాన్న అమాయకుడు. ప్రజలకు వినోదం పంచడం మాత్రమే తెలిసిన గాయకుడు’అని ఆయన తెలిపారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని తెలిపారు. గాయకుడు అందారబీ ఘిచాక్ అనే వాద్య పరికరాన్ని వాయిస్తారు. తన జన్మభూమి, తన ప్రాంత ప్రజలు, తన దేశం గురించి సంపద్రాయ, దేశభక్తిని ప్రబోధించే పాటలు పాడుతుంటారు. కళాకారుల హక్కులను గౌరవించేలా అంతర్జాతీయ సమాజం తాలిబన్లపై ఒత్తిడి తేవాలని ఐరాస సాంస్కృతిక విభాగం ప్రతినిధి కరీమా బెన్నౌన్ అన్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఆగ్నెస్ కల్లామర్డ్ స్పందిస్తూ... తాలిబన్ల వైఖరి మార లేదనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment