కీవ్: రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం నీటి కష్టాల్లో మునిగిపోయింది. నీటి సరఫరాకు కీలకమైన విద్యుత్ సరఫరా కేంద్రంపై రష్యా వైమానిక సేనలు సోమవారం గగనతల దాడులను హఠాత్తుగా ఉధృతం చేశాయి. దీంతో నగరంలో చాలా ప్రాంతాల్లో నీటి రవాణా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. సోమవారం కీవ్ నగరంలో 80 శాతం వినియోగదారులకు నీటి సదుపాయం లేకుండాపోయిందని నగర మేయర్ విటలీ క్లిట్స్‌చోకో ఆందోళన వ్యక్తంచేశారు. కీవ్‌లో సోమవారం తెల్లవారుజాము నుంచే రష్యా దాడులతో పేలుళ్ల శబ్దాలు మార్మోగాయి.
ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా, రక్షణ, విదేశాంగ మంత్రులతో కలిసి కీవ్‌ను సందర్శిస్తున్న వేళ కీవ్‌పై బాంబు దాడులు జరగడం గమనార్హం. కీవ్ ఉత్తరప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా సేనలు పరస్పర దాడులు చేసుకున్నాయి. డినిపర్ నది ఎడమవైపు తీరం దాడుల పొగతో నిండిపోయింది. కొన్ని చోట్ల రైళ్లకు విద్యుత్ సరఫరా ఆటంకాలు ఏర్పడ్డాయి. క్రిమియా ద్వీపకల్పంలో నల్ల సముద్రంలో తీర స్థావర నౌకలపై ఉక్రెయిన్ బాంబుదాడులు చేసిందని రష్యా ఆరోపిస్తుండగా, రష్యానే పేలుడుపదార్ధాలను సరిగా ‘నిర్వహించలేక’ పేలుళ్లకు కారణమైందని ఉక్రెయిన్ స్పష్టంచేసింది. నౌకలపై దాడులతో ఆగ్రహించిన రష్యా.. ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతి ఒప్పందాన్ని తాజాగా రద్దుచేసుకుంది. దీంతో పలు దేశాలకు ధాన్యం సరఫరా స్తంభించి మళ్లీ ధరలు పెరిగే ప్రమాదం పొంచిఉంది.
Comments
Please login to add a commentAdd a comment