దూకుడు పెంచిన రష్యా.. పుతిన్‌ తీరుపై ఫుల్‌ ఫైర్‌ | UN Chief Antonio Guterres Condemns Russia Move | Sakshi
Sakshi News home page

దూకుడు పెంచిన రష్యా.. పుతిన్‌ తీరుపై ఐరాసలో కీలక చర్చ

Published Wed, Feb 23 2022 11:11 AM | Last Updated on Wed, Feb 23 2022 1:55 PM

UN Chief Antonio Guterres Condemns Russia Move - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అతిక్రమిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది.

రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్‌ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను మిన్‌స్క్‌ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్‌ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు.

బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్‌ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్‌ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కాగా, రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. 

(ఇది చదవండి: రష్యాకు షాకిచ్చిన అమెరికా.. బైడెన్‌ కీలక నిర్ణయం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement