వాషింగ్టన్: ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేపట్టిన హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా మిత్రపక్షాలు కన్నెర్ర చేశాయి. హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా-బ్రిటన్ గురువారం వైమానిక దాడులు జరిపాయి. హౌతీలపై తదుపరి చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులను లక్ష‍్యంగా చేసుకుని దాడులు చేయడం ఇదే మొదటిసారి.
'అమెరికా, మా భాగస్వాముల ఓడలు, సిబ్బందిపై హౌతీల దాడులు సహించబోం. ఎర్రసముద్రంలో వాణిజ్య రవాణాలపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదు.' అని బైడెన్ అన్నారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య ఓడలపై దాడులు చేస్తున్న హౌతీల సామర్థ్యం దెబ్బతీయడానికి ఇదే ముందుస్తు సూచన అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
వైమానికి, నౌకాయాన, జలాంతర్గాములతో దాడులు జరుగుతున్నాయని ఓ అమెరికా అధికారి తెలిపారు. డజనుకు పైగా ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించారు. హౌతీల సైనిక సామర్థ్యాలను బలహీనపరిచేందుకు దాడులు చేశామని అధికారి తెలిపారు.
యెమెన్ రాజధాని సనాతో పాటు సాదా, ధమర్, హోడెయిడా గవర్నరేట్‌లో దాడులు జరిగినట్లు హౌతీ అధికారులు ధృవీకరించారు. ఈ దాడులను అమెరికన్-జియోనిస్ట్-బ్రిటిష్ దురాక్రమణ అని ఆరోపించారు. గత అక్టోబర్‌లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పశ్చిమాసియాలో తాజాగా అమెరికా మిత్రపక్షాల దాడులు నాటకీయ పరిణాలను సంతరించుకున్నాయి.
ఇజ్రాయెల్ దాడులపై పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్‌కు మద్దతుగా హౌతీలు ఎర్రసముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. హౌతీలు ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 నౌకలపై దాడి చేశారు. ప్రపంచ నౌకా వాణిజ్యంలో 15% వాటా కలిగిన యూరప్-ఆసియా మధ్య కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇందులో ఇజ్రాయెల్ వైపు 1,200 మంది చనిపోయారు. గాజాలో 23,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.
ఇదీ చదవండి: North Korea: కిమ్ జోంగ్ ఉన్ కీలక నిర్ణయం.. కరోనా తర్వాత రష్యా కోసం..
Comments
Please login to add a commentAdd a comment