
పోలీసుల నిర్ణక్ష్యం కారణంగా బిడ్డను కోల్పోయిన మహిళా ఖైదీ. పరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించమన్న అప్పీల్ కోర్టు
Pregnant Inmate Suffered Miscarriage As Cops Stopped At Starbucks: అమెరికాలో ఆరెంజ్ కౌంటీ జైలులో ఉన్న మహిళా ఖైదీకి పోలీసుల నిర్లక్ష్యం కారణంగా గర్భస్రావం అయ్యింది. దీంతో కోర్టు బాధిత మహిళకు పరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించమని జైలు అధికారులను ఆదేశించింది. వాస్తవానికి 2016లో సదరు మహిళా ఖైదీ 28 ఏళ్ల సాండ్రా క్వినోన్స్‌కి కొన్ని షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైంది.
ఐతే ఆమె ఆ బెయిల్ నియమాలను ఉల్లంఘించడంతో జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. అదే సమయంలో ఆమె గర్భవతి. ఐతే ఆమెకు ఒక రోజు ఉమ్మనీరు లీకవ్వడంతో తన పరిస్థితి బాగోలేదని ఆస్పత్రికి తీసుకెళ్లండని పోలీసులను వేడుకుంది. కానీ పోలీసులు ఆమె పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా గర్భవతి అని కనికరం లేకుండా ... ఇంతటి ఎమర్జెన్సీ టైంలో ఒక కాఫీ హోటల్ వద్ద కారుని చాలాసేపు ఆపేశారు.
కనీసం అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేదు. పోలీసుల నిర్లక్ష్య వైఖరి కారణంగా... ఆమె తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. దీంతో సదరు మహిళా ఖైదీ తనకు న్యాయం చేయాలంటూ కోర్టు మెట్లెక్కింది. బాధితురాలి తరుఫు న్యాయవాది నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె పట్ల పోలీసులు కావాలనే ఉదాసీనతగా వ్యహరించారని కోర్టుకి తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కి కాల్ చేయలేదని రెండు గంటల ఆలస్యం కారణంగా అత్యంత విలువైన మాతృత్వపు భాగ్యాన్ని పొందలేకపోయిందని చెప్పారు.
దీంతో కోర్టు జైలు సూపర్‌వైజర్స్‌ని బాధిత ఖైదీ క్వినోన్స్‌కు సుమారు రూ. 3 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీనికి జైలు సూపర్ వైజర్లు అంగీరించారు గానీ అందుకు సదరు బాధితురాలు కూడా అంగీకరిస్తేనే ఈ ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్ ఖరారు అవుతుందని కూడా స్పష్టం చేసింది. తొలుత సదరు మహిళా ఖైదీ పిటీషన్‌ని అక్టోబర్ 2020లో ఫెడరల్ కోర్టు కొట్టేసింది, కానీ అప్పీల్ కోర్టు గతేడాది ఈ కేసును తిరిగి పునరుద్ధరించి ఈ తీర్పును వెల్లడించింది.
(చదవండి: పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి... 937 మంది మృతి)