అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ
అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే పత్రాలపై సంతకాలు
వచ్చే నెల 1న హారిస్‌ను తమ నామినీగా ఎన్నుకోనున్న డెమొక్రటిక్ ప్రతినిధులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ పోటీ చేయబోతున్నట్లు దాదాపు తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ నుంచి తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. తమ అభ్యర్థిగా కమలా హారిస్ పేరును డెమొక్రటిక్ పార్టీ తరఫున అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటివరకు పారీ్టలో కమలా హారిస్ మినహా ఇతరులెవరూ అభ్యర్థిత్వం కోసం పోటీపడలేదు.
డెమొక్రటిక్ నేషనల్ కమిటీ నిబంధనల ప్రకారం ఆగస్టు 1న పార్టీ ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో తమ నామినీని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీలో ఇతరులు పోటీ పడకపోతే కమలా హారిస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం లాంఛనమే. అలాగే ఆగస్టు 7లోగా ఆమె తమ ఉపాధ్యక్ష అభ్యర్థిని(రన్నింగ్ మేట్) ఎంపిక చేసుకోవాల్సి ఉంది. షికాగోలో ఆగస్టు 19 నుంచి 22 వరకు డెమొక్రటిక్ జాతీయ సదస్సు జరుగుతుంది.
నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విజయం తనదేనని కమలా హారిస్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసం పొందడానికి, ప్రతి ఓటునూ సంపాదించడానికి కష్టపడి పని చేస్తానని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రచారం సాగిస్తానని, వారి మద్దతుతో రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తానని పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు జో బైడెన్ గత ఆదివారం ప్రకటించిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ తెరపైకి వచి్చంది. ఆమె ప్రచారం కూడా ప్రారంభించారు. ఇప్పటికే 40కిపైగా రాష్ట్రాల డెమొక్రటిక్ ప్రతినిధులు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
ట్రంప్‌కు సమఉజ్జీగా...
న్యూయార్క్ టైమ్స్ పోల్ వెల్లడి
జో బైడెన్ నిష్క్రమణలో అర్ధాంతరంగా అమెరికా అధ్యక్ష రేసులోకి వచి్చనప్పటికీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనూహ్యంగా పుంజుకుంటున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో సమానంగా కమల ప్రజామోదాన్ని పొందుతున్నారని న్యూయార్క్ టైమ్స్– సియానా కాలేజ్ తాజా పోల్ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న అమెరికా ఓటర్లలో 48 శాతం మంది ట్రంప్ వైపు మొగ్గగా, 47 శాతం మంది కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. ఇదే న్యూయార్క్ టైమ్స్ పత్రిక జూలై మొదటివారంలో నిర్వహించిన సర్వేలో బైడెన్‌పై ట్రంప్ ఏకంగా ఆరు పాయింట్ల ఆధిక్యాన్ని సాధించారు. దీన్ని హారిస్ ఒక పాయింటుకు తగ్గించడం గమనార్హం. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్‌కు 48 శాతం, హారిస్‌కు 46 శాతం మద్దతు లభించింది.
సొంత పారీ్టల్లో సమాన మద్దతు
రిపబ్లికన్లలో ట్రంప్‌ను 93 శాతం మంది బలపరుస్తుండగా, కమలా హారిస్‌కు సైతం డెమొక్రాట్లలో 93 శాతం మద్దతు లభించడం విశేషం. శ్వేతజాతియేతర, యువ ఓటర్లలో బైడెన్‌కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు హారిస్‌కు ఈ వర్గాల మద్దతు లభిస్తోందని సర్వే తెలిపింది. లాటిన్ అమెరికా మూలాలున్న ఓటర్లు, 30 ఏళ్ల లోపు ఓటర్లలో హారిస్‌కు 60 శాతం మద్దతు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment