మనిషికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలేమి అనేది హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఊబకాయం, చిత్తవైకల్యం మొదలైన సమస్యలను సృష్టిస్తుంది. మానసిక స్థితిని త్రీవంగా ప్రభావితం చేస్తుంది. మతిమరపును కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థలోని ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అటువంటి సందర్భాలలో ప్రమాదాల బారినపడే అవకాశం ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఎవరైనా సరే మంచి ప్రశాంతతను పొందుతారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం అణు రియాక్టర్ మెల్ట్‌డౌన్‌లు, పెద్ద ఓడలు మునిగిపోవడం, విమాన ప్రమాదాలు వంటి విషాదకర సంఘటనల వెనుక నిద్రలేమి కారణంగా నిలుస్తుంది.
సైన్యంలో పని చేసేవారికి నిద్రా సమయం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు నిద్ర వచ్చేందుకు, మంచి విశ్రాంతి తీసుకునేందుకు ఒక టెక్నిక్ అనుసరిస్తారు. దానిని మిలటరీ మెథడ్ అని అంటారు. ఈ విధానం ద్వారా ఎవరైనా సులభంగా త్వరగా నిద్రపోవచ్చు. అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిసారిగా 1981లో ‘రిలాక్స్ అండ్ విన్: ఛాంపియన్‌షిప్ పెర్ఫార్మెన్స్’ అనే పుస్తకంలో ఈ టెక్నిక్‌కు సంబంధించిన పలు వివరాల అందించారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరకారంలో మిలిటరీ పద్ధతిని ఉపయోగించిన ప్రీ-ఫ్లైట్ స్కూల్‌లోని పైలట్లు 10 నిమిషాల్లోనే నిద్రపోయారని ఆ పుస్తకంలో తెలియజేశారు. ఈ పద్ధతిని ఉపయోగించిన 96% పైలట్‌లు యుద్ధ సమయంలోనూ కొద్దిసేపటికే మంచి విశ్రాంతి తీసుకోగలిగారని వెల్లడయ్యింది.
ఐదు దశల్లో త్వరగా నిద్ర
ఈ మ్యాజిక్ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానం ద్వారా ఎవరైనా సరే త్వరగా నిద్రపోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1 మీ ముఖాన్ని రిలాక్స్ చేయండి: మీ ముఖంలోని నుదురు, కళ్ళు, బుగ్గలు, దవడ మొదలైన వాటిపై దృష్టి పెట్టండి. వాటిపై ఒత్తిడి ఉన్నట్లు భావించి, తరువాత దానిని వదిలివేసి, రిలాక్స్ అవుతున్నట్లు భావించండి.
2 మీ భుజాలను వదులు చేయండి: మీ చేతులను రిలాక్స్ చేయండి. మీ భుజాలు విశ్రాంతిగా ఉన్న భావన చేయండి. చేతులు, భుజాల మీదుగా గాలి తగులుతూ అది మెల్లగా మీ చేతుల కిందకి వస్తున్నట్లు ఊహించండి.
3 గట్టిగా ఊపిరి తీసుకోండి. నెమ్మదిగా గాలిని బయటకు వదలండి. మీరు అలా చేస్తున్నప్పుడు, అది మీ కడుపుని ఎలా తేలికపరుస్తున్నదనే దానిపై దృష్టి పెట్టండి. మీ కడుపును బిగపట్టడానికి ప్రయత్నించవద్దు. అన్ని అవయవాలు తేలికపడినట్లు భావించండి.
4 మీ కాళ్ళను విశ్రాంతి తీసుకోనివ్వండి. నునువెచ్చని గాలి మీ కాళ్ళను సున్నితంగా తాకుతున్నట్లు భావించండి. మీ కాళ్ళు మంచంపై రిలాక్స్ అవుతున్నట్లు చేయండి.
5 మీ మనసును ప్రశాంతపరచండి. ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు మేఘాలను తదేకంగా చూడడం లేదా ప్రశాంతమైన చిత్రాలను చూసేందుకు ప్రయత్నించండి. 10 సెకన్ల పాటు మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు త్వరగా నిద్రపడుతుంది.
అభ్యాసంతో సాధ్యం
ఈ మిలటరీ మెథడ్ గురించి సైన్స్ ఏమి చెబుతున్నదంటే.. ఈ విధానంలోని1, 2, 5 దశలు కండరాలకు సడలింపునిస్తాయి. ప్రశాంతతకు, శాంతియుత స్థితిని ప్రేరేపించడానికి మంచి మార్గాలుగా నిలుస్తాయి. మూడవ దశలో శ్వాస పద్ధతులు మెరుగుపడతాయి. ఐదవ దశ శరీరాన్ని మరింత రిలాక్స్ చేస్తుంది. ఈ ప్రక్రియ అత్యంత త్వరగా నిద్రను అందిస్తుంది.
ఈ మిలటరీ మెథడ్‌లో అనేక ప్రయోజనాలుఉన్నాయి. నిద్ర అలవాట్లను మెరుగుపరచడానికి ఉత్తమమైన మార్గాలలో ఇది ఒకటి అని పలు పరిశోధనలలో తేలింది. అయితే మిలటరీ మెథడ్‌లో తక్షణ ఫలితాలను ఆశించకూడదని, ఇది అలవడేందుకు రెండు నుంచి ఆరు వారాల సమయం పట్టవచ్చని నిపుణులుచెబుతున్నారు.
ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు
Comments
Please login to add a commentAdd a comment