అదను చూసి దెబ్బ.. ఇరాన్‌ దాడులపై ఇజ్రాయెల్‌ అల్టిమేటం | This Is What Iran Said At UN On Israel Attack | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ సంచలన ప్రకటన.. అదను చూసి దెబ్బ కొడతామన్న ఇజ్రాయెల్‌

Published Mon, Apr 15 2024 8:04 AM | Last Updated on Mon, Apr 15 2024 12:00 PM

This Is What Iran Said At UN On Israel Attack - Sakshi

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మూడో ప్రపంచ యుద్ధం అంశం తెర మీదకు వచ్చింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఇరాన్‌ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌పై తాజా దాడుల్ని ఇరాన్‌ ఐక్యరాజ్య సమితి వేదికగా సమర్థించుకుంది.  కేవలం ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భద్రతా మండలి వైఫల్యాన్ని ఇరాన్‌ ఎండగట్టింది. 

‘‘అంతర్జాతీయ శాంతిని నెలకొల్పడం భద్రతా మండలి బాధ్యత. కానీ, గత కొన్ని నెలలుగా ఆ బాధ్యతల్ని నిర్వర్తించడంలో భద్రతా మండలి ఘోరంగా విఫలమైంది. గత్యంతరం లేకనే ఆత్మరక్షణ కోసం ఇరాన్‌, ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులకు పాల్పడాల్సి వచ్చింది. మా(ఇరాన్‌) దేశం యుద్ధాన్ని, యుద్ధ వాతావరణాన్ని కోరుకోదు. కానీ, బెదిరింపులకు, ఆక్రమణలకు, దాడులకు తెగబడితే మాత్రం గట్టిగానే స్పందిస్తుంది అని ఐక్యరాజ్య సమితిలో ఇరాన్‌ ప్రతినిధి అమీర్ సయీద్ ఇర్వానీ తెలిపారు. 

ఇదిలా ఉంటే.. దాదాపు 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ విరుచుకుపడింది. అయితే ఆ దాడుల్ని బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ, మిత్రదేశాల సాయంతో అంతే సమర్థవంతంగా తిప్పి కొట్టింది ఇజ్రాయెల్‌. ఇక.. ఈ దాడులకు అదను చూసి తగిన రీతిలో ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్‌ మంత్రి బిన్నీ గంట్జ్‌ తాజాగా ప్రకటించారు. 

సిరియా డమాస్కస్‌లో ఇరాన్‌ కాన్సులేట్‌ భవనాన్ని ఇజ్రాయెల్‌ మిస్సైల్స్‌ నేల మట్టం చేట్టాయి. అయితే ఈ చర్యకు పాల్పడింది తాము కాదని, ఈ ప్రాంతంలోని ఇతరత్రా శక్తులని ఇజ్రాయెల్ ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. అయితే మధ్యలో పవిత్ర రంజాన్ మాసం రావడంతో ఈ ప్రక్రియను వాయిదా వేసింది. మధ్యలో అమెరికాకు కూడా ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసింది. ఇది తమకు ఇజ్రాయెల్‌కు నడుమ పోరు అని, ఇందులో అమెరికా తలదూర్చితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధ్యక్షులు జో బైడెన్‌కు హెచ్చరికలు పంపించింది. మిలిటరీ శక్తిలో బలం ఉన్న ఇరాన్‌ ప్రతిగానే ఇప్పుడు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. అయితే ఇరాన్‌ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ముందుకు వచ్చింది.

ఇరాన్‌లో 1979 నాటి ఇస్లామిక్ రెవెల్యూషన్ నాటి నుంచి కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఉద్రిక్తతలు ఉంటూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇరు దేశాల నడుమ ఇది డైరెక్ట్ అటాక్ దశకు చేరింది. ఈ పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశాయి. కాగా ఈ దాడికి తమ ప్రతిదాడి తీవ్రస్థాయిలోనే ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇరాన్ తమ దేశానికి పాత శత్రువు. ఈ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఎప్పుడూ సిద్ధమే అని, ఈ క్రమంలో ఇక తమ ప్రతిచర్య తప్పదని ఆదివారం ఆయన ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement