ఒక్క చాన్స్‌ ఇవ్వండి..! | - | Sakshi
Sakshi News home page

ఒక్క చాన్స్‌ ఇవ్వండి..!

Published Wed, Oct 11 2023 7:56 AM | Last Updated on Wed, Oct 11 2023 10:05 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: విజయం.. వేదిక ఏదైనా బరిలో ఉన్నవారితో దోబూచులాడే అనుభూ తి. ఆఖరి క్షణం వరకు పోరాటం చేసినా.. ఎవరిని వరిస్తుందో తెలియని ఉత్కంఠ. అందు కే, ఓటమిని తలచుకొని బాధ పడకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా చివరి వరకు పోరాడాలి అంటారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పలువురు నాయకులు అసెంబ్లీకి పోటీ పడుతున్న తీరు కూడా అలాగే కనిపిస్తోంది. పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల ఎమ్మెల్యే ఆశావహులు తమను ఈసారైనా గెలిపించాలని.. ఒక్క చాన్స్‌ ప్లీజ్‌ అంటూ ప్రజల ముందుకు వస్తున్నారు. విపక్షాల మాటలు నమ్మితే మోసపోతారని, తమను తిరిగి గెలిపిస్తే అభివృద్ధి కొనసాగిస్తామని.. తమకు మరో అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, కొత్త ఆశావహులు ప్రచారం ప్రారంభించారు.

వరుస ఓటములు.. అయినా బరిలో..
ఉమ్మడి జిల్లాలో పలువురు వరుస ఓటములు ఎదురైనా ఏమాత్రం కుంగిపోకుండా విజయం కోసం బరిలో నిలుస్తూనే ఉన్నారు. వీరిలో ఎక్కు వ మంది కాంగ్రెస్‌ నుంచే ఉండటం గమనార్హం.

2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆది శ్రీనివాస్‌(వేములవాడ), అడ్లూరి లక్ష్మణ్‌(ధర్మపురి), కేకే మహేందర్‌రెడ్డి(సిరిసిల్ల) నాలుగు సార్లు బీఆర్‌ఎస్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. అయినా, వీరంతా ఏమాత్రం వెరవకుండా ఈసారి ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

కరీంనగర్‌ నుంచి 2014, 2018 ఎన్నికల్లో ఎంపీ బండి సంజయ్‌(బీజేపీ), పొన్నం ప్రభాకర్‌(కాంగ్రెస్‌)లు రెండుసార్లు ఓడారు. అయినా మూడోసారి బరిలో దిగి, గెలుపు రుచి చూడాలనుకుంటున్నారు.

హుజూరాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి 2018లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి, ఓడిపోయారు. ఇప్పుడు అసెంబ్లీకి తిరిగి పోటీ చేస్తున్నారు.

మానకొండూరు నుంచి 2009లో ప్రజారాజ్యం, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కవ్వంపల్లి సత్యనారాయణ ప్రస్తుతం కాంగ్రెస్‌ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

2014లో స్వతంత్ర, 2018లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రామగుండం బరిలో నిలిచిన మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌కు నిరాశ ఎదురైంది. ఈసారి కర్ణాటక ఎన్నికల ప్రభావం, ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలిస్తుందని విజయంపై ధీమాగా ఉన్నారు.

► కోరుట్ల నియోజకవర్గం నుంచి 2014లో స్వతంత్ర, 2018లో కాంగ్రెస్‌ నుంచి జువ్వాడి నర్సింగరావు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారు.

2009లో పెద్దపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయరమణారావు గెలిచారు. తర్వాత 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచినా విజయం వరించలేదు. ఈ సారీ ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

2014లో, 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కరీంనగర్‌ నుంచి పోటీ చేసిన చల్మెడ లక్ష్మీనరసింహారావు ఓడిపోయారు. ప్రస్తుతం పార్టీ మారి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వేములవాడ నుంచి బరిలో నిలిచారు.

మంథని నుంచి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పుట్ట మధు పోటీచేసి, ఓడిపోయారు. 2014లో బీఆర్‌ఎస్‌ నుంచి విజయం సాధించారు. 2018లో పరాజయం పాలైనా.. ఈసారి విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

అభివృద్ధిపై సిట్టింగ్‌ల హామీ
మరోవైపు ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలకు గానూ 11 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులే బరిలో ఉన్నారు. వీరిలో 8 మంది సీనియర్లు కాగా.. ముగ్గురు కొత్తగా పోటీలో నిలిచారు. తమకు మరో చాన్స్‌ ఇస్తే.. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌, పింఛన్లు, గృహలక్ష్మి, బీసీబంధు తదితర సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేయడంతోపాటు మరింత అభివృద్ధి చేసి చూపుతామని హామీ ఇస్తున్నారు.

కేటీఆర్‌ (2009, 2010, 2014, 2018) నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సిరిసిల్లలో తన మార్క్‌ చూపించారు. సిరిసిల్ల నేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తనను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు.

► గంగుల కమలాకర్‌ 2009లో టీడీపీ, 2014, 2018లో బీఆర్‌ఎస్‌ నుంచి హ్యాట్రిక్‌ విజ యం సాధించి, కరీంనగర్‌లో కొత్త రికార్డు సృష్టించారు. స్మార్ట్‌సిటీ, కేబుల్‌ బ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్‌ వంటి రూ.వందల కోట్ల ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో మంత్రిగా నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు. నాలుగోసారి విజయంపై కన్నేశారు.

కొప్పుల ఈశ్వర్‌ 2004, 2008లో మేడారం నుంచి 2009, 2010, 2014, 2018లో ధర్మపురి నుంచి వరుసగా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ధర్మపురి నుంచే బరిలో నిలిచారు.

2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌(మానకొండూరు), దాసరి మనోహర్‌రెడ్డి(పెద్దపల్లి), వొడితెల సతీశ్‌బాబు (హుస్నాబాద్‌) తాజా ఎన్నికల్లో గెలిచి, హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

2018 ఎన్నికల్లో డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ (జగిత్యాల), కోరుకంటి చందర్‌(రామగుండం), సుంకె రవిశంకర్‌(చొప్పదండి) గెలిచారు. రెండోసారి విజయం సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.

ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌ నుంచి 2004, 2008, 2009, 2010, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు బీఆర్‌ఎస్‌ కారు గుర్తుపై గెలిచారు. అనూహ్యంగా పార్టీ మారి, 2021 ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమయ్యారు.

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983 టీడీపీ నుంచి శాసనసభకు వెళ్లిన ఆయన.. 1989, 1996 ఉప ఎన్నిక, 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలవనున్నారు.

డాక్టర్‌ సంజయ్‌ కోరుట్ల, పాడి కౌశిక్‌రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావు కొత్తగా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయనున్నారు. వీరిలో కౌశిక్‌, చల్మెడ గతంలో కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచినవారే.

2009, 2010 ఉప ఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచిన కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రమేశ్‌బాబు మాత్రం 2009లో టీడీపీ నుంచి గెలవగా, కోరుట్ల నుంచి విద్యాసాగర్‌రావు నాలుగుసార్లు కారు గుర్తు మీదనే గెలవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement