సింహం, ఏనుగులే ప్రత్యామ్నాయం! | - | Sakshi
Sakshi News home page

సింహం, ఏనుగులే ప్రత్యామ్నాయం!

Published Wed, Sep 6 2023 12:44 AM | Last Updated on Wed, Sep 6 2023 1:33 PM

- - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. గులాబీ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ జాబితాపై కసరత్తు ప్రారంభించింది. బీజేపీ కూడా ఎమ్మెల్యే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఈ నెలాఖరు వరకు కాంగ్రెస్, బీజేపీల జాబితాపై స్పష్టత రానుంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పలువురు అసంతృప్తులు ఎలాగైనా ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి కూడా జాబితా వెల్లడయ్యాక.. అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వీరంతా తమ పార్టీ, అధికార పార్టీ కాకుండా మరో ప్రత్యామ్నాయ వేదిక నుంచి పోటీ చేసేందుకు సై అంటారనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో వీరికి రాజకీయంగా రెండు వేదికలు అందుబాటులో ఉంటాయి. అవి ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) కాగా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ). ఈ రెండు పార్టీలు జిల్లాలో చాలాకాలంగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. రెండు పార్టీలకు బలమైన క్రియాశీలక నేతలు లేకపోయినా, అసంతృప్తులను అప్పటికపుడు అక్కున చేర్చుకునే రాజకీయ వేదికలుగా మారాయి.

సెంటిమెంట్‌కు మారుపేరుగా..
ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) గతంలో నామమాత్రంగా ఎన్నికల సమయంలో మాత్రమే తెరపైకి వచ్చేది. కానీ, 2018లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆలిండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ) గుర్తు సింహం సింబల్‌పై గెలుపొందడంతో ఈ పార్టీ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగింది. అప్పట్లో కోరుకంటి చందర్‌ విజయం ఒక సంచలనం. చందర్‌ గెలిచిన తరువాత ఉమ్మడి జిల్లాలో సింహం గుర్తు సానుభూతికి మారుపేరుగా మారిపోయింది. అధికార – ప్రతిపక్ష పార్టీలో టికెట్‌ ఆశించి భంగపడ్డ వారంతా క్రమంగా ఏఐఎఫ్‌బీలో చేరడం, సింహం గుర్తుపై పోటీ చేయడం ఆనవాయితీగా మారింది.

ఈ పార్టీగుర్తుపై పోటీ చేసిన వారిలో విజయశాతం కూడా బాగుండటం అసంతృప్తులు పార్టీని ఎంచుకోవడానికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇదేదారిలో పయనించిన 24 మంది రాజకీయ నేతలు స్థానిక సంస్థల్లో విజయం సాధించి సింహం గుర్తుతో తమ సత్తా చాటుకున్నారు. అయితే, వీరంతా తరువాత అధికార పార్టీకి చేరువవుతండటం గమనార్హం.

ప్రస్తుతం రామగుండంలో కందుల సంధ్యారాణి, పెద్దపల్లిలో నల్ల మనోహర్‌రెడ్డి సింహం గుర్తుపై పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. వీరే కాక ఉమ్మడి జిల్లాలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసంతృప్తులు సైతం బీఎస్పీతోనూ టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 

60 అసెంబ్లీ స్థానాల్లో పోటీ 
క్రితంసారి రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 188 మంది మా పార్టీ నుంచి పోటీ చేయగా.. 92 మంది విజయం సాధించారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో 13 స్థానాలు, రాష్ట్రవ్యాప్తంగా 60 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఏఐఎఫ్‌బీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ భావజాలానికి, ఆయన సిద్ధాంతాలను అభిమానించే వారు, కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్నవారు మా పార్టీని తప్పకుండా ఆదరిస్తారు.                   – జోజిరెడ్డి, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఏఐఎఫ్‌బీ గెలిచిన సీట్లు ఇవే..
రామగుండం అసెంబ్లీ: ఎమ్మెల్యే (తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు) స్థానికసంస్థల్లో ఇలా..
►  కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 12 పోటీ మంది చేస్తే 3 సీట్లు దక్కించుకున్నారు. దాదాపుగా 12,700 ఓట్లు సాధించారు. అదేసమయంలో కాంగ్రెస్‌ 50 స్థానాల్లో పోటీ చేయగా.. 9,000కుపైగా ఓట్లు రావడం గమనార్హం.

► రామగుండంలో 14 స్థానాల్లో పోటీ చేయగా.. 9 మంది కార్పొరేటర్లు విజయం సాధించడం ఇక్కడ సింహం సింబల్‌కు ఉన్న ఆదరణకు నిదర్శనం. 

►    చొప్పదండిలో ఎంపీటీసీ స్థానం, పెద్దపల్లి 5 ఎంపీటీసీలు, మానకొండూరులో ఒకటి, రాయికల్‌లో ఒకటి, రామగుండంలో ఎంపీటీసీ మొత్తానికి 9 ఎంపీటీసీ స్థానాల్లో సింహం విజయం సాధించింది.

► చొప్పదండి మున్సిపల్‌లో ఒక కౌన్సిలర్, జగిత్యాలలో ఒక కౌన్సిలర్,  పెద్దపల్లిలో ఒక కౌన్సిలర్‌ చొప్పున ముగ్గురు గెలిచారు. 

బోణీ కోసం బీఎస్పీ తహతహ..
► 2004లో, 2014లో బీఎస్పీ తెలంగాణలో మంచిప్రభావమేచూపింది. 2014లో రెండు అసెంబ్లీ స్థానాలు గెలిచిన తరువాత తిరిగి ఆ స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. 2004లో కరీంనగర్‌ పార్లమెంటు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి 43వేల ఓట్లు వచ్చాయి. 2006లో కోనరావుపేటలో ఐదు ఎంపీటీసీలు, సుల్తానాబాద్‌లో రెండు ఎంపీటీసీలు గెలుచుకుంది.

► 2021లో ఆర్‌ఎస్‌ ప్ర వీణ్‌కుమార్‌ రాష్ట్ర ప గ్గాలు చేపట్టాక పార్టీ మునపటి కంటే ఆర్థి కంగా బలపడిందన్న ధీమా కేడర్‌లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి అసెంబ్లీ బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష(ఐఐటీ– ఖరగ్‌పూర్‌) పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉంటూ, విజయంపై ధీమాగా ఉన్నా రు. మిగిలిన స్థానాల్లోనూ నిశ్శబ్ద ఫలితా లు ఉంటాయని, ప్రవీణ్‌కుమార్‌ నాయకత్వం, ఆయనకు జిల్లాతో ఉన్న అనుబంధం తమకు కలిసి వస్తుందని నాయకులు ధీమాగా ఉన్నారు. ఈసారి పోటీ చేసేందు కు ఇతర పార్టీల నుంచి వచ్చినా.. తమపార్టీ నిబంధనలకు కట్టుబడి ఉంటేనే టికెట్‌ ఇస్తామని నాయకులు స్పష్టంచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement