
నిరుపేదను కబళించిన అప్పులు
● సిరిసిల్లలో కూరగాయల వ్యాపారి ఆత్మహత్య
సిరిసిల్లటౌన్: కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు ఓ నిరుపేదను కబళించాయి. అప్పులు కట్టలేని దుస్థితిలో కూరగాయలు అమ్ముకునే ఓ చిరు వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన ఎర్రం కొండయ్య(58) మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు కూతుళ్లు రజిత, అనిత, కొడుకు రాకేశ్‌ల వివాహాలు చేశాడు. ఇంటి అవసరాల నిమిత్తం చేసిన అప్పులు లక్షల్లో పేరుకుపోగా.. వాటిని తీర్చలేనేమోనన్న బెంగతో బుధవారం ఇంట్లోంచి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి సాయినగర్ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కొండయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతుడికి భార్య పుష్పలత ఉంది.
రైలు కింద పడి చిరువ్యాపారి మృతి
● మృతుడి స్వస్థలం ఉత్తరప్రదేశ్
రామగుండం: రామగుండం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై రైళ్లలో విక్రయించే వెండర్ ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతిచెందాడు. జీఆర్పీ ఔట్ పోస్టు ఇన్‌చార్జి గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. రామగుండం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై వాటర్ బాటిళ్లు విక్రయించే చిరు వ్యాపారి వరుణ్‌కుమార్‌సింగ్ గురువారం భద్రాచలం వైపు వెళ్తున్న సింగరేణి ప్యాసింజర్ రైలులో ఎక్కి విక్రయిస్తున్న క్రమంలో రైలు కదిలింది. అప్పటికే బోగిలో పలువురికి వాటర్ బాటిళ్లు విక్రయించి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కిందికి వెళ్లాడు. రైలు అతడిపై నుంచి వెళ్లడంతో దేహం రెండు ముక్కలైంది. అప్పటివరకు అందరితో కలిసి ముచ్చటించిన వరుణ్‌కుమార్ కొద్దిసేపట్లోనే రైలు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తోటి వ్యాపారులు రోదించారు. మృతుడు వారం క్రితమే రామగుండంకు చేరుకున్నట్లు తెలిసింది. మృతుడి స్వగ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియోరియా జిల్లా అఖాన్‌పూర గ్రామం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించి అనంతరం బంధువులకు అప్పగించనున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తిరుపతి పేర్కొన్నారు.

నిరుపేదను కబళించిన అప్పులు