వరంగల్: ఎక్కడ అన్యాయం జరిగినా.. తనకే జరుగుతున్నట్లు అన్వయించుకుని.. అందుకు తగ్గట్టుగా పాటలు అల్లి.. తన దరువుతో ఉర్రూతలూగించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఆయన ఇక లేరనే వార్త విన్న ఉమ్మడి వరంగల్ కళాకారులు, కవులు, రచయితలు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆటపాటలతో ఉద్యమాలను రగిల్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు.. ఓరుగల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది.
తన గళంతో మేధావులు, భూస్వాముల బిడ్డలను సైతం సాయుధ పోరాటం వైపు ఆకర్షితులను చేశారు. అనేక మందిని పీపుల్స్ ఆర్మీగా తయారుచేశారు. ఇప్పుడా పాట మూగబోయింది. పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ కీలక ఘట్టాలకు వేదికై న ఓరుగల్లులో.. గద్దర్ ఉద్యమ ప్రస్థానం ఇలా.. కారంచేడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ గద్దర్ చేపట్టిన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఉద్యమకారులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.
► 1979 నుంచి 1983 వరకు చాపకింద నీరులా కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ వ్యాప్తి క్రమంలో జనగామ జిల్లాలో మేథావి, విద్యార్థి, ప్రజాకవులతో ప్రజాగాయకుడిగా సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జన నాట్యమండలి రాష్ట్ర సారధిగా గద్దర్ వ్యవహరించడంతో జిల్లా నుంచే అత్యధిక కళాకారుల చేరారు.
► 1989 : పీపుల్స్‌వార్ పార్టీకీ అప్పటి సీఎం చెన్నారెడ్డి లీగల్ పీరియడ్ ఇచ్చారు. దీంతో తొలుత జనగామలోనే గద్దర్ బహిరంగ సభ నిర్వహించి ప్రజాసమస్యల సాధనతోపాటు సమసమాజ స్థాపన లక్ష్యంగా పెద్దఎత్తున యువత చేరేలా తన ఆటాపాటలతో చైతన్యం కలిగించారు.
► 1997 : సెప్టెంబర్‌లో వరంగల్ డిక్లరేషన్ సదస్సుకు హాజరయ్యారు.
► 1999 : కరీంనగర్ కొయ్యూరు ఎన్‌కౌంటర్‌లో అశువులు బాసిన జనగామ జి ల్లా కడవెండికి చెందిన మావోయిస్టు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్ అంత్యక్రియలకు ప్రభుత్వం నిర్భందాలను అధిగమించి వేలాది మంది నివాళురి్పంచేలా తన ఆటపాటలతో చైతన్య పరిచారు. మైదనా ప్రాంతంలో నక్సల్ పార్టీ ప్రభావం తగ్గిన క్రమంలో దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడవెండిలో పలు సామాజిక ఉద్యమ పోరా టాల్లో పాల్గొనడం అనివార్యంగా మారింది.
► 2007 : మలివిడద తెలంగాణ సాధన ఉద్యమంలో జనగామ డివిజన్ పరిధి బైరాన్‌పల్లి నుంచి కడవెండి మీదుగా తెలంగాణ అమరుల దీపయాత్ర ప్రారంభించారు. మణుగూరు వద్ద గోదావరి నుంచి ప్రారంభమైన కళాకారుల శాంతియాత్ర అన్ని జిల్లాల్లో 24 రోజులపాటు సాగింది.
► 2008 మే 25, 2009 : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సమావేశంలో పాల్గొన్నారు.
► 2009 : వరంగల్ ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జిల్లా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కలిసి తెలంగాణ ఉద్యమంపై ధూంధాం నిర్వహించారు.
► 2010 : ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టాలని ఐదు రోజులు జిల్లాకు చెందిన ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లో పాదయాత్ర చేశారు. చివరిరోజు ఆజంజాహి మైదానంలో జరిగిన సభలో గద్దర్ తన పాట, ప్రసంగంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు.
► 2010 అక్టోబర్ 6 : హనుమకొండ టీఎన్జీఓ భవన్‌లో జరిగిన వరంగల్ జిల్లా జేఏసీ స్టీరింగ్ సమావేశంలో గద్దర్ పాల్గొన్నారు.
2011 : బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో గద్దర్ తనదైన శైలిలో దీపారాధన, గీతారాధనతో కార్యక్రమం చేపట్టారు.
► 2012 : ‘ఓపెన్ కాస్ట్ హఠావో సింగరేణి బచావో’ నినాదంతో చేపట్టిన బొగ్గు గనుల సంరక్షణ ఉద్యమం సందర్భంగా ములుగులో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
► 2022 జూన్ : గద్దర్ వరంగల్‌లో జరిగిన తెలంగాణ అమరవీరుల సంతాపసభలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment