హైవే.. అధ్వానం..
ఎన్‌హెచ్ 353(సీ) రహదారి గుంతలమయం
● కాళేశ్వరం, మహదేవపూర్ టు
భూపాలపల్లి వరకు ఓ వైపు గాడాలు
● పట్టించుకోని అధికారులు
● ఫిబ్రవరి, మే నెలల్లో
కాళేశ్వరంలో ఉత్సవాలు
● మరమ్మతులు చేయకుంటే ఇబ్బందులే..
కాళేశ్వరం: అసలే జాతీయ రహదారి..ఆపై మూడు రాష్ట్రాలకు తరలిపోయే రహదారి కూడా. శ్రీకాళేశ్వర ముక్తీశ్వరాలయానికి నిత్యం వేల సంఖ్యలో ఇదే రహదారి గుండా వందల సంఖ్యలో ఆర్టీసీతో పాటు ప్రైవేట్ వాహనాల్లో భక్తులు తరలివస్తుంటారు. దీనికితోడు ఇసుక లారీలతో రోడ్డు గుంతలమయంగా మారి మహదేవపూర్ టు భూపాలపల్లి వరకు ఓ వైపు గాడాలు పడ్డాయి. కానీ జాతీయ రహదారి అధికారులు మాత్రం రోడ్డు వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫిబ్రవరి, మే నెలల్లో కాళేశ్వరంలో ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో మరమ్మతులు చేపట్టకుంటే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.
మహదేవపూర్ చౌక్‌లో భారీగా..
మహదేవపూర్ మండలకేంద్రంలోని శ్రీపాదచౌక్ వద్ద రోడ్డు గుంతలమయంగా తయారైంది. మోకాలు భారీ లోతు గుంతల్లో రాత్రి, పగలు ప్రయాణికుల వాహనాలు పడి ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వచ్చిపోయే వాహనదారులు ఆ ప్రాంతంలో నానా ఇబ్బందులు పడుతున్నారు. దారిపై అవగాహన లేని కొత్తవారి కార్లు, ద్విచక్రవాహనాలు గుంతల్లో పడి చెడిపోతున్నాయి.
వచ్చే నెలలో కుంభాభిషేకం..
కాళేశ్వరాలయంలో వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉంది. సుమారు 50వేల వరకు భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి. దీనికి కూడా లక్షకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా. మే నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. సుమారు రోజుకు 50వేల నుంచి లక్ష వరకు భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం టు భూపాలపల్లి వరకు రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వరంగల్ ఎన్‌హెచ్ ఈఈ మనోహర్‌ను ఫోన్‌లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
శాశ్వత పరిష్కారం చూపాలి..
మహదేవపూర్ చౌక్ వద్ద జాతీయ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై గాడాలు ఏర్పడి ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌హెచ్ అధికారులు శాశ్వత పరిష్కారం చేయాలి.
– బెల్లంపల్లి సురేష్, ఎమ్మార్పీఎస్
మండల అధ్యక్షుడు, మహదేవపూర్
Comments
Please login to add a commentAdd a comment