
సన్నబియ్యం పంపిణీ సక్రమంగా చేయాలి
కాటారం: ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ రేషన్‌దుకాణాల ద్వారా సక్రమంగా జరగాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కాటారం మండలం కొత్తపల్లి చౌకధరల దుకాణాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. ఎన్ని కిలోల సన్న బియ్యం ఇస్తున్నారు.. ఎలా పంపిణీ జరుగుతుందని లబ్ధిదారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల సన్న బియ్యం అందజేస్తుందన్నారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు సన్న బియ్యం స్టాక్ చేరిందని లబ్ధిదారులు తమ కోటా బియ్యం తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 77శాతం మేర సన్న బియ్యం పంపిణీ జరిగిందని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సన్న బియ్యం పంపిణీపై క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా బియ్యం పంపిణీ వ్యవస్థ పకడ్బందీగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టంచేశారు. సన్నబియ్యం పంపిణీ విషయంలో రేషన్ డీలర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రేషన్ బియ్యం సక్రమంగా అందించాలి
మల్హర్: రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యాన్ని లబ్ధిదారులకు సక్రమంగా అందించాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ డీలర్లను ఆదేశించారు. మండలంలోని పెద్ద తాడిచర్ల గ్రామంలోని రేషన్‌షాపును గురువారం అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ షాపు రికార్డులు, లబ్ధిదారుల వేలిముద్రలను పరిశీలించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలిపారు. కార్డుదారుల కుటుంబసభ్యులకు ఒక్కొక్కరికి ఆరు కేజీల చొప్పున సన్నబియ్యం ఇవ్వాలని డీలర్‌కు సూచించారు. అనంతరం మల్లారం దుబ్బగట్టు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్ రా రైస్ మిల్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, తహసీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
14 వరకు దరఖాస్తుల స్వీకరణ..
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు గడువు పెంచిందని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. కాటారం మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను కలెక్టర్ పరిశీలించారు. పథకం యూనిట్ల వివరాల ఫ్లెక్సీ ఏర్పాటుతో పాటు హెల్ప్‌డెస్క్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. దరఖాస్తుదారుల వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేసుకొని రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, ఎంపీడీఓ బాబు, నయాబ్ తహశీల్దార్ రామ్మోహన్, అధికారులు ఉన్నారు.

సన్నబియ్యం పంపిణీ సక్రమంగా చేయాలి