వనపర్తి: నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై మరోమారు సందిగ్ధం నెలకొంది. ఢిల్లీ పెద్దలు 20 రోజుల పాటు చర్చలు జరిపి చివరకు టికెట్‌ను మాజీ మంత్రి డా.జి.చిన్నారెడ్డికి ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం గాంఽధీభవన్‌లో టికెట్లు ఖరారైన వారిలో సుమారు 70 మంది అభ్యర్థులను పిలిపించి బీ–ఫారాలు కూడా అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన పేర్లలో మూడు నియోజకవర్గాల్లోని అభ్యర్థులను మార్చాలని అధిష్టానం నిర్ణయించగా.. అందులో వనపర్తి కూడా ఉంది.
తన పేరును స్వయంగా సోనియాగాంధీ సూచించి అభ్యర్థుల జాబితాలో రాయించిందంటూ మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి తన కుమారుడితో కలిసి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నెల 7న నామినేషన్ దాఖలు చేసేందుకు కార్యకర్తలు, నాయకులతో చర్చలు జరిపి జన సమీకరణకు కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదివారం శ్రీరంగాపురం మండలంలో ప్రచారం కూడా చేశారు. అధిష్టానం ఇచ్చిన షాక్‌తో సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలిసి ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.
మేఘారెడ్డికి అవకాశం..
ఇటీవల అధికార పార్టీ నుంచి బయటకు వచ్చి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డికి కాంగ్రెస్‌పార్టీ బీ–ఫారం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గంలో కొన్ని నెలలుగా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లేవల్ నుంచి పైకి తీసుకొచ్చి జనంలో పేరు తెచ్చుకున్నారని, అభ్యర్థిగా మేఘారెడ్డి ఉండాలని సర్వేల్లో వెల్లడైనందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చి పదేళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాల్లో వనపర్తి అభ్యర్థి మార్పు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
రాహుల్‌గాంధీ ప్రకటించినా..
ఇటీవల కొల్లాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో వనపర్తి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి డా. జి.చిన్నారెడ్డి అంటూ స్వయంగా రాహుల్‌గాంధీ సభకు పరిచయం చేసినా.. అభ్యర్థిత్వాన్ని మార్చడంతో కాంగ్రెస్ పార్టీలో ఇవేం నిర్ణయాలనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment