శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో భర్త పార్థివ దేహం వద్ద విలపిస్తున్న విజయకుమారి
తుని రూరల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవానుగా జమ్ములో విధులు నిర్వహిస్తున్న తంతటి కిరణ్ కుమార్ (41) సోమవారం బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. తుని మండలం హంసవరం గ్రామం ఆయన స్వస్థలం. కిరణ్‌కుమార్ మృతి సమాచారం తెలియడంతో ఆయన భార్య విజయకుమారి, సోదరుడు రవికుమార్ హుటాహుటిన జమ్మూ వెళ్లారు.
వారికి కిరణ్ కుమార్ పార్థివ దేహాన్ని సీఆర్‌పీఎఫ్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో అప్పగించారు. భర్త మృతదేహాన్ని చూసి విజయకుమారి కన్నీరు మున్నీరుగా విలపించారు. రాత్రికి విశాఖపట్నానికి చేరుకుని తెల్లవారుజామున మృతదేహాన్ని గ్రామానికి తీసుకువస్తామని బంధువులు తెలిపారు. కిరణ్‌కుమార్ మృతదేహానికి బుధవారం ఉదయం అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కిరణ్ కుమార్‌కు భార్యతో పాటు కుమారుడు జతిన్ (12), కుమార్తె మెర్సీ (10), తల్లిదండ్రులు జాన్, భాగ్యవతి ఉన్నారు.
దేశ సేవలో ఇద్దరు కుమారులు
హంసవరం గ్రామానికి చెందిన జాన్, భాగ్యవతి దంపతులకు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూండగా రెండో కుమారుడైన కిరణ్ కుమార్ 2005లో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. మూడో కుమారుడు రవికుమార్ ఆర్మీలో చేరాడు. ఇద్దరు కొడుకులు దేశ రక్షణలో సేవలు అందిస్తూండటం తమ కుటుంబానికి ఎంతో సంతోషాన్నిచ్చిందని, కిరణ్ కుమార్ మృతి పుత్రశోకాన్ని మిగిల్చిందని తల్లిదండ్రులు బోరున విలపించారు. కిరణ్ కుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులను సర్పంచ్ రాయి మేరీ అవినాష్ పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment